Apr 05,2023 16:43
  • బాబూ జగజ్జీవన్ రామ్ కు ఘన నివాళులర్పించిన 
  • గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి 
  •  ఎం.కిరణ్ కుమార్ 

ప్రజాశక్తి-గూడూరు : తలదించుకున్న చోటే తలెత్తుకొని నిలబడాలని, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన జనహృదయనేత, సమసమాజ స్థాపన కై కృషి చేసిన మహనీయుడు, స్వాతంత్ర సమర యోధుడు, గొప్ప రచయిత, గొప్ప రాజకీయవేత్త భారత జాతి ఆణిముత్యం బాబూ జగజ్జీవన్ రామ్ అని గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం. కిరణ్ కుమార్ అన్నారు. ఆయన జీవిత ప్రస్థానంలో 50 సంవత్సరాల రాజకీయ జీవితం, అందులో 30 సంవత్సరాలు మంత్రి పదవులను అలంకరించి వాటికి వన్నె తెచ్చేలా తనదైన ముద్ర వేసి దేశాభివృద్ధికి ప్రగతికి బాటలు వేసిన భారత జాతి ఆణిముత్యం, అంబేద్కర్ సమానుడు దళిత తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలుబుధవారం ఘనంగా నిర్వహించారు, ముందుగా ఆయన చిత్రపటానికి  పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శవంతమైన సామాజిక, రాజకీయ జీవితం గడిపిన భారత జాతి ఆణిముత్యం బాబూ జగజ్జీవన్ రామ్ అని తెలిపారు, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆనాడు ఆయన చేపట్టిన సంస్కరణలు నేటికి ఆదర్శనీయంగా నిలవడం విశేషమన్నారు, దేశం రాజకీయ- సామాజిక అంశాలలో ఆయన తనదైన ముద్ర వేసుకోవడానికి, మేధస్సుతో ముందుకు సాగటానికి ఆయన చదివిన విద్య ప్రధాన కారణమని చెప్పారు,.ఆయన సిద్ధాంతాలలోని వాస్తవికతను తెలుసుకోవడమే యువత ఆయనకు అర్పించే నిజమైన నివాళి అన్నారు, 14 శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేసే జాతికి విలువైన సేవలు అందించిన జగజ్జీవన్ రామ్ అపార నైపుణ్యంతో దేశ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించగలిగారని తెలిపారు .ఈ కార్యక్రమంలో  అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.