ప్రజాశక్తి- విజయనగరం టౌన్ : అవసరంలేని బైపాస్ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన గురువారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద పెందుర్తి, బొడ్డవర 516 జాతీయరహదారి నిర్వాసిత రైతులు ధర్నా చేశారు. ఈ సందర్బంగా హైవే పోరాట కమిటీ కన్వీనర్ చల్లా జగన్, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు మాట్లాడుతూ రైతుల అభిప్రాయం తీసుకోకుండా, గ్రామసభలో నిర్వహించకుండా పచ్చటి పంట పొలాల్లో రాళ్లు పాతడం , నోటిఫికేషన్ జారీ చేయడం దుర్మార్గమని అన్నారు. , వెంటనే నోటిఫికేషన్ రద్దుచేసి గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ ఇతర హైవేలు ఉన్నందున పెందుర్తి- బొడ్డవర హైవే వెడల్పు తగ్గించాలన్నారు. కొత్తవలస, ఎస్.కోట ఏరియాలో సుమారు 23 కిలోమీటర్ల బైపాస్ పేరుతో మళ్లీ కొత్తగా భూమి తీసుకోవడం రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు. అవసరం లేని బైపాస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో బహిరంగ మార్కెట్లో ఉన్న ధరకు అదనంగా రెండు రెట్లు కలిపి ఇవ్వాలన్నారు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు , చిరు వ్యాపారులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలన్నారు. ధర్నాలో హైవే నిర్వాసితుల పోరాట కమిటీ కో కన్వీనర్ గొంప కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు, నిమ్మలపాలెం సర్పంచ్ కె శ్రీనివాసరావు, కర్రి శ్రీను, సిరసపల్లి వెంకటరమణ, కొర్రాయి సూర్య దేవుడు తదితరులు పాల్గొన్నారు.










