Oct 18,2023 20:25

రెప్పపాటులో మాయమవుతున్న ద్విచక్రవాహనాలు
హడలిపోతున్న వాహనదారులు
పోలీసులు నిఘా పెట్టాలని వేడుకోలు
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌

             జిల్లాలో బైకు దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. రెప్పపాటులో తాళం వేసిన వాహనాలను సైతం మాయం చేస్తున్నారు. వరుస బైక్‌ దొంగతనాలతో వాహనదారులు హడలెత్తిపోతున్నారు. మాదకద్రవ్యాలు, గంజాయి, ఇతర వ్యసనాలకు అలవాటు పడిన కొందరు బృందాలుగా ఏర్పడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి ఆయా ప్రాంతాల్లో కొందరు సహకరించి వీరు దొంగతనం చేసుకొచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసి వారికి కొంత సొమ్ము ముట్ట చెబుతున్నట్లు సమాచారం. పెనుగొండ ప్రాంతంలో నడుస్తున్న మోటార్‌సైకిల్‌ విడిభాగాల అమ్మకాల దుకాణాల వద్ద వీటిని గుట్టుగా అమ్మకం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. భారీఎత్తులో అక్కడ అమ్మకాలు జరుగుతున్నా పోలీసులు దృష్టి సారించకపోవడం వెనుక భారీగా సొమ్ములు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ బైక్‌ దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. దొంగతనలను అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. భీమవరం జిల్లా కేంద్రం కావడంతో పట్టణ ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుంచి నిత్యం వేలాదిమంది వివిధ పనులపై భీమవరం వచ్చి వెళ్తుంటారు. దీంతో ద్విచక్ర వాహనాలపై వచ్చినవారు తమ వాహనాలను పార్క్‌ చేసి పని ముగించుకుని తిరిగి వచ్చేసరికి దొంగలు ఆ బైకులను చోరీ చేస్తున్నారు. ఇటీవల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తాళం వేసి ఉన్న ఒక ద్విచక్రవాహనాన్ని అపహరించుకుపోయారు. వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండో పట్టణంలోని రాయలం వెళ్లే రోడ్డులో కరెంట్‌ ఆఫీస్‌ ప్రాంతంలో మరో బైక్‌ దొంగతనానికి గురైనట్లు సమాచారం. భీమవరానికి చెందిన ఒక విలేకరి స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో ఉన్న వినాయక ఆలయం వద్ద వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లి వచ్చేలోపు దొంగలు బండిని మాయం చేశారు. ఎక్కువగా ఆసుపత్రి వద్ద రోగుల బంధువుల ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివ అనే వ్యక్తి అనారోగ్యంగా ఉన్న తన కుమారుడిని డాక్టర్‌కి చూపించి వచ్చే లోపు తన ద్విచక్రవాహనాన్ని చోరి చేశారు. ఈ నెల ఆరో తేదీన డిఎస్‌పి కార్యాలయం పక్కనే ఉన్న యుటిఎఫ్‌ కార్యాలయం వద్ద పార్క్‌ చేసిన ద్విచక్రవాహనాన్ని దొంగలు అపహరించుకుపోయారు. ఇటీవల కాలంలో ఒక ఇంట్లో దొంగలు చోరీ చేసి పోలీస్‌ డాగ్స్‌ కనిపెట్టకుండా కారం చల్లి వెళ్లారంటే వారి ఆలోచన ఏ విధంగా ఉందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. వరుస దొంగతనాలపై ఆయా పరిధిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల నుంచి స్పందన ఉండడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బైక్‌ పోయినప్పటికీ పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తాము తిరగలేమని ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికైనా ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను తక్షణమే అరెస్టు చేయాలని, చోరీకి గురైన తమ వాహనాలను తమకు అప్పగించాలని బాధితులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు. పోలీసులు దొంగలపై నిఘా పెట్టినప్పటికీ ఇటీవల రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీంతో నిరసనకారుల గృహ నిర్బంధానికి, నిరసన కార్యక్రమాలు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని, ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారని ప్రజలు చెబుతున్నారు. దొంగతనాలను అరికట్టాలని వాహనదారులు, పట్టణ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.