'బైజూస్'తో అందుబాటులో సాంకేతిక విద్య : ఎంఎల్‌ఎ
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
శ్రీమంతుల పిల్లలు చదువుకొనే విద్యాసంస్థల ప్రమాణాలను ప్రభుత్వ పాఠశాలలలో చదివే పేద పిల్లలకు అందించాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే విద్యపై అనేక ప్రయోగాలు చేసిన బైజుస్ వారితో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు ఒక బహుమతిగా అత్యంత విద్యా ప్రమాణాలు కలిగిన ట్యాబ్ లు అందిస్తున్నారని శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ పండిత జవహర్లాల్ నెహ్రూ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తిరుపతి నియోజకవర్గం లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజుస్ ట్యాబ్ లను అందించే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నగర పాలక మేయర్ శిరీష , కమిషనర్ అనుపమ అంజలి అతిథులుగా పాల్గొన్నారు. తిరుపతి శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి విద్య తో పోటీ పడాలని ఒక వర ప్రసాదంలా ముఖ్యమంత్రి 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాంకేతికతో కూడిన విద్య గల పాఠ్యాంశాల ట్యాబ్ లను అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా 1400 కోట్లు ఖర్చు చేసి 4, 56, 832 ట్యాబ్ లను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈనెల 28 లోపు అందించాలని నిర్ణయించారని అన్నారు. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 28 పాఠశాలల్లో చదువుతున్న 1856 మంది 8వ తరగతి విద్యార్థులకు, 148 మంది ఉపాధ్యాయులకు 2004 ట్యాబ్ లను అందించనున్నామని అన్నారు. నగరపాలక కమిషనర్ చిన్న వయసు కల వ్యక్తని, కానీ మా అందరి కన్నా పెద్ద స్థాయి ఐఏఎస్ ఉద్యోగస్తురాలని, ఈ గౌరవం విద్యతోనే సాధ్యమైందని విద్యార్థులు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కార్పొరేటర్లు బసవ గీత, వెంకటేశ్వర్లు , జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, ఎంఈఓ ప్రభాకర్ రాజు, నగరపాలక అడిషనల్ కమిషనర్ సునీత, నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మునిశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
తూర్పు రోడ్లతో తిరుపతికి మహర్దశ : ఎమ్మెల్యే
నగరాభివద్దికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేయడం అవసరమని, తిరుపతి నగరానికి ప్రతిపాదిత తూర్పు రోడ్ల అభివద్దితో తిరుపతి నగరం అభివద్ధి సాదిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో చేపడుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల స్థితిగతులపై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినరు రెడ్డి శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తిరుపతి నగరాభివద్దికి అవసరమైన 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసే ప్రకియలో అధికారులు ప్రజలతో మమేకమై పనులు పూర్తి చేసేందుకు కషి చేయాలన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన అన్నమయ్య మార్గ్, వై.ఎస్.ఆర్ మార్గ్ మాస్టర్ ప్లాన్ రోడ్లు నగర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వున్నాయన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి అభివద్దికి దూరంగ వున్న కోర్లగుంట ప్రధాన రోడ్డు విస్తరణతో ఆ ప్రాంతం రాకపోకలతో ఎంతో అభివద్ది చెందుతుందన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు అమలు అవుతున్న ప్రాంతాల్లోని స్థలాలు ఇచ్చిన వారికి త్వరగా టిడిఆర్ బాండ్లను అందించేందుకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనుకున్న సమయంలోనే మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసి తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినరు రెడ్డి స్పష్టం చేసారు.










