అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విదేశాంగ విధానంలో ఆసియా అత్యంత ముఖ్యమైన అంశంగా ఉండడమే కాదు, మరింత తీవ్రంగా అది ముందుకొస్తుందనడానికి స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. చైనా పై ముప్పేట దాడి (హైబ్రిడ్ వార్)ని బైడెన్ ప్రభుత్వం తీవ్రతరం చేసే సూచనలూ కనిపిస్తున్నాయి. బైడెన్ విదేశాంగ విధానాన్ని అమలులో పెట్టే బృందం కూర్పు, దాని నడక ఎలా ఉండబోతుందన్నదనే అంశం అటు కొలంబియా దగ్గర నుంచి ఇటు బీజింగ్ వరకు పలు దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యమైన అంశాలపై అమెరికా విదేశాంగ బృందం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయాల్సి ఉంది. ఆంటోని బ్లింకెన్‌ను విదేశాంగ మంత్రిగా, జాకవ్ జేక్ సులివాన్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా బైడెన్ నియమించారు. వారు కొన్నిటిపై తమ అభిప్రాయాలను బాహాటంగా వెల్లడించారు. అయితే, అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన అంశాలపై అధికారికంగా వారు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చైనాపై రుద్దుతున్న హైబ్రిడ్ వార్, 30 దేశాలపై అది విధించిన ఆంక్షలు, ఆఫ్ఘనిస్తాన్‌లో సాగిస్తున్న యుద్ధం మొదలైన అంశాలు బైడెన్‌కు సవాళ్లుగా నిలిచాయి.
బైడెన్ ఇంతకు ముందున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లా పెద్దయెత్తున నోరేసుకుని రెచ్చగొట్టే మాటలు మాట్లాడకపోవచ్చు. కానీ, విదేశాంగ విధానానికి సంబంధించినంతవరకు ట్రంప్ అనుసరించిన పంథానే అనుసరిస్తారా? లేక దానికి భిన్నమైన మార్గంలో వెళ్తారా అన్నది తేలాల్సి ఉంది. నిజానికి, ఈ వైఖరి ట్రంప్ బుర్రలో నుంచి వచ్చింది కాదు, ప్రపంచాధిపత్యం కోసం అమెరికా దీర్ఘకాలంగా అనుసరిస్తూ వస్తున్న విధానం నుంచి వచ్చిందే. బైడెన్ విదేశాంగ విధానంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ఆసియా ఉండబోతోంది.
చైనా పట్ల అమెరికా ఎలా వ్యవహరించాలన్నది బైడెన్ ముందున్న ప్రధాన సమస్య. బరాక్ ఒబామా అనుసరించిన పంథానే స్వీకరించిన ట్రంప్ దానికి మరిన్ని కోరలు తొడిగాడు. చైనా పట్ల శత్రుపూరిత వైఖరితో వ్యవహరించాడు.చైనా సామాజిక, ఆర్థిక ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఒబామా 'పైవోట్ టు ఆసియా' విధానాన్ని రూపొందించాడు. చైనాను వాణిజ్యపరంగా, సైనిక పరంగా దెబ్బతీయాలని ప్రయత్నించాడు. ట్రంప్ 'వాణిజ్య యుద్ధం' లక్ష్యం కూడా అదే. కాకుంటే ట్రంప్ దీనిని కటువుగా చెప్పాడు.
చైనా చుట్టూ సైనిక వలయం ఏర్పాటు కోసం అమెరికా ఎప్పటి నుంచో యత్నిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకు నిరంతరం కుట్రలు పన్నడం అమెరికా విదేశాంగ విధానంలో ఒక సాధారణ అంశం. ఒబామాకు, ట్రంప్‌కు మధ్య తేడా ఎలాంటిదో, ట్రంప్, బైడెన్ మధ్య తేడా కూడా అలాగే ఉంటుంది. అమెరికా విస్తరణ వాదంతో చైనా బలహీనపడడం అంత తేలికేమీ కాదని వారికి తెలుసు. చైనా సామాజికంగా, ఆర్థికంగా సాధించిన విజయాలు దాని రాజకీయ సంకల్పాన్ని మరింత గట్టిపరచింది. తన కాళ్లపై తాను నిలబడగలనన్న దృఢ విశ్వాసాన్నిచ్చింది. దీనిని సహించలేకే చైనా పట్ల అమెరికా మరింత ప్రమాదకరమైన వైఖరి తీసుకుంది. ఒబామా హయాంలోనే దీనికి రూపకల్పన జరిగింది. అయినా అమెరికా ఆధిపత్యవాదానికి తలొంచేది లేదని చైనా స్పష్టం చేయగా, చైనా ఎదుగుదలను అనుమతించేందుకు తాను సిద్ధంగా లేనని అమెరికా అంటోంది.
చైనా పట్ల ట్రంప్ తీసుకున్న దుందుడుకు వైఖరి సరైనదేనని బ్లింకెన్ అన్నారు. మునుపటి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాదిరే బ్లింకెన్ కూడా చైనాను ఇబ్బంది పెట్టడం కోసం తైవాన్, హాంకాంగ్, సింజియాంగ్‌పై చిచ్చు రగిలించాలని చూస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి కేంద్రమైన చైనా సిలికాన్ వ్యాలీపై ఆతృత చెందే కన్నా మానవ హక్కులపై యాగీ చేయడమే మేలని బ్లింకెన్ భావించారు. అదే సమయంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి అరిగిపోయిన రికార్డులా పాడిందే పాట పాడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తన యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. వెనిజులా, బొలీవియాల్లో ప్రజాస్వామ్యాన్ని కూలదోయాలని చూస్తున్నారు. అసలు సమస్య మానవ హక్కులు కాదు, బలమైన ఆర్థిక శక్తిగా ఎదగకుండా చైనాను అడ్డుకోవడమే.
చైనా ఆర్థిక మంత్రిగా నియుక్తులైన జనెట్ యెలెన్ తన నామినేషన్‌ను ధ్రువీకరించే సెనేట్ విచారణకు హాజరై ఆర్థిక అంశాలపైనే ఆతృత వ్యక్తం చేశారు. చైనా వాణిజ్యవిధానాలు నిందార్హమైనవి, అన్యాయం, అక్రమమైనవని రంకెలేశారు. మేధో సంపత్తి హక్కులను దొంగిలిస్తుందని ఆమె ఆరోపించారు. చైనా మానవ హక్కుల గురించి యెలెన్ మాట్లాడలేదు. కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముఖ్యంగా టెలికమ్యూనికేషన్, గ్రీన్ టెక్నాలజీలో చైనాను నిర్ణయాత్మక స్థానంలో నిలబెట్టిన విధానాలపై ఆమె విమర్శలు ఎక్కుపెట్టారు.
ఇండో-పసిఫిక్ కమాండ్
2007లో జార్జి డబ్ల్యు బుష్ చతుష్ఠయ కూటమి (క్వాడ్) పేరుతో కొత్త వేదికను ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా సభ్యులుగా ఉన్నాయి. చైనా వ్యతిరేకత, ఒకరి ప్రయోజనాల కోసం ఒకరు మద్దతుగా నిలవడం, సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడం ఇవీ స్థూలంగా క్వాడ్ లక్ష్యాలు. 2008లో ఆస్ట్రేలియాలో కెవిన్ రూడ్ ఎన్నిక కావడం, భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ చైనా వ్యతిరేకత దేశ ప్రయోజనాలకు దోహదపడదని భావించి ఎడంగా ఉన్నారు. దీంతో 2017 వరకు క్వాడ్ స్తబ్దుగా ఉంది. ఆసియాలో తన ఉనికిని చాటుకోవడానికి, చైనా ఎదుగుదలను దెబ్బ తీయడానికి కోసం అమెరికా ఈ కూటమిని కొత్తగా తెరపైకి తీసుకొచ్చింది. చారిత్రికంగా అమెరికా దృష్టి ఎప్పుడూ యూరప్, లాటిన్ అమెరికా, పశ్చిమాసియాపై ఉంటుంది. కానీ, ఒబామాకు మాత్రం చైనా శాస్త్ర సాంకేతికాభివృద్ధిలో వేగంగా పురోగమించడం అమెరికాకు ముప్పుగా అనిపించింది. చైనాను ఎలాగైనా కట్టడి చేయాలని అనుకున్నారు. అందు కోసం 'పైవోట్ టు ఆసియా' (ఆసియా కీలకం) విధానాన్ని ముందుకు తెచ్చారు. ఈ బాధ్యతను తూర్పు ఆసియా పసిఫిక్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కుర్తు కాంప్‌బెల్‌కు అప్పగించారు. పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకుని వాషింగ్టన్, హాంకాంగ్‌లలో 'ఆసియా గ్రూపు' పేరుతో ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకున్నారు. ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్‌షిప్ పేరుతో వాణిజ్య ఒప్పందాన్ని ఒబామా తీసుకొచ్చారు. దాని చుట్టూ పైవోట్ ఆసియాను నడిపించాలని ఒబామా అనుకున్నారు. 2010లో ఒకినావాలో అమెరికా స్థావరాన్ని తొలగిస్తానని ప్రతిన బూనిన ప్రధాని యుకియో హతయోమోను ఆ పదవి నుంచి తొలగించడంలో ఒబామా ప్రభుత్వం కీలక భూమిక వహించింది. ట్రంప్ హయాంలో ఒబామా పైవోట్ టు ఆసియా మరింత విస్తరించింది. అయితే ఒబామా వాణిజ్య విధానాన్ని ట్రంప్ పక్కన పెట్టారు. ట్రాన్స్ అట్లాంటా పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. చైనాపై దూకుడుగా వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు. ట్రంప్ మిలిటరీ నాయకత్వం ఇండో పసిఫిక్ కమాండ్‌ను ఏర్పాటు చేసింది. చైనాను లక్ష్యంగా చేసుకుని ఈ మిలిటరీ పొత్తుపై ప్రధానంగా కేంద్రీకరించారు. ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌లలో అధికారం చేపట్టిన కొత్త రాజకీయ నాయకులు పచ్చి మితవాదులు కావడంతో ట్రంప్ వారితో కలసి క్వాడ్‌ను తిరిగి తెరపైకి తెచ్చారు. క్వాడ్ పునరుద్ధరణలో సహకరించినందుకు కృతజ్ఞతగా ట్రంప్ దిగిపోయే ముందు అమెరికాలో అత్యున్నత పురస్కారమైన 'లెజియన్ ఆఫ్ మెరిట్'ను ఆస్ట్రేలియా (స్కాట్ మోరిసన్), భారత్ (నరేంద్ర మోడీ), జపాన్ (షింజో అబే) లకు ప్రకటించారు.
ట్రంప్ అనుసరించిన విధానాన్నే బైడెన్ కొనసాగించనున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కుర్తు కాంప్‌బెల్‌ను బైడెన్ తిరిగి తీసుకున్నారు. 'ఆసియా జార్'గా పిలువబడే కాంప్‌బెల్ ఈ బాధ్యతలను స్వీకరించిన వెంటనే తన కార్యాలయాన్ని పునర్వ్యవస్థీకరించారు. ముగ్గురు సీనియర్ డైరక్టర్లను (ఒబామా వెటరన్స్‌గా పేరొందినవారిని) తీసుకున్నారు. వారు ఆండ్రియా కెండాలి టేలర్ (రష్యా, మధ్య ఆసియా వ్యవహరాలు), సుమోనా గుహ (దక్షిణాసియా వ్యవహారాలు), లారా రోజెన్‌బర్గర్ (చైనా వ్యవహారాలు). రోజెన్‌బర్గర్ కొత్త విదేశాంగ మంత్రి బ్లింకెన్‌కు అత్యంత సన్నిహితురాలు. కరోనా నర్విహణలో చైనాను బాహాటంగా విమర్శలు చేయడంలో ఆమె ముందున్నారు. చైనాను విమర్శిస్తూ ఆమె గతంలో రాసిన వ్యాసాలు న్యూస్ వీక్‌లోను, ఇతర అమెరికన్ పత్రికల్లోను ప్రచురితమయ్యాయి. మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాదిరిగానే నోటి దురుసుతనం ఎక్కువ. ఇండో పసిఫిక్ పట్ల ముఖ్యంగా చైనా విషయంలో అమెరికా విధానం ఎలా ఉండబోతున్నదీ దీనిని బట్టే తెలిసిపోతోంది. బైడెన్ తన పశ్చిమాసియా టీమ్‌కు భిన్నంగా ఆసియా పోర్టుఫోలియోను విస్తరించారు. పశ్చిమాసియా టీమ్‌కు ఒక్కరే డైరక్టర్.
జపాన్ ప్రయోజనాలు కాపాడతానని బైడెన్ హామీ ఇచ్చారు. 2020 నవంబరులో ఆ దేశ ప్రధాని యోషిడే సుగాతో చైనా-జపాన్ మధ్య ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ, 'అమెరికా-జపాన్ వ్యూహాత్మక పొత్తు ఒప్పందంలోని ఆర్టికల్5 ద్వారా వస్తే, జపాన్‌కు తాము దన్నుగా ఉంటామని' అన్నారు. బైడెన్ మాటాల్లో జపాన్ ప్రయోజనాలు కాపాడేందుకు చైనా సైనిక బలాన్ని ఉపయోగింస్తుందన్న ధ్వని వినిపించింది.
బ్లింకెన్ తన నియామకాన్ని ధ్రువీకరించే సెనేట్ ముందు మాట్లాడుతూ, తైవాన్ పెద్ద పాత్ర పోషించాలని అమెరికా కోరుకుంటోందని అన్నారు. తైవాన్‌ను బలోపేతం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. అంతేకాదు, తైవాన్ తనను తాను రక్షించుకునేందుకు అవసరమైన రక్షణ సాయం కూడా అందిస్తామని చెప్పారు. అంటే, ట్రంప్ హయాంలో అందించిన మిలిటరీ సాయాన్ని కొనసాగిస్తామని చెప్పడమే. ఈ రెండు ప్రకటలను బైడెన్ ప్రభుత్వం చైనాపై హైబ్రిడ్ వార్‌ను కొనసాగించడమే గాక, మరింత తీవ్రతరం చేయొచ్చని అర్థమవుతుంది.
బైడెన్ ప్రమాణ స్వీకారం తరువాత వివిధ దేశాల అధినేతలతో ఫోన్‌లో జరిపిన సంభాషణల్లో ఆసియాలో అమెరికా అనుసరించే విధానం గురించి నొక్కి చెప్పారు. జపాన్ ప్రధాని సుగాతో జరిపిన సంభాషణలో జపాన్‌కు అవసరమైన సాయం అందించేందుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. అమెరికా-జపాన్ పొత్తు, అరమరికలు లేని స్వేచ్ఛా ఇండో-పసిఫిక్ ఒప్పందాలు ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలకు మూలమలుపు కానున్నాయని అన్నారు. భారత్‌కు కూడా ఇదే విధమైన సంకేతాలు ఇచ్చారు. జేక్ సులివాన్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మాట్లాడుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సన్నిహిత సహకారాన్ని కొనసాగించాల్సిన ప్రాముఖ్యత గురించి చెప్పారు.
బైడెన్ విధానాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ, ఒక విషయం మాత్రం ఇప్పటికే స్పష్టమైంది. క్వాడ్‌లో భాగస్వాములైన ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌తోబాటు ఇతర దేశాలతో కలసి చైనాపై హైబ్రిడ్ వార్ సాగించడం, ఒత్తిడి పెంచడం వంటివి చేస్తుంది. అయితే, జపాన్, ఆస్ట్రేలియా, ద. కొరియా వంటి దేశాలు చైనాతో వాణిజ్య సంబంధాలను తెంచుకునేందుకు సిద్ధంగా లేవు. వీటి సహకారం లేకుండా అమెరికా ఏమీ చేయలేదు. ఈ దేశాలు చైనాతో కలసి వాణిజ్య కూటమి కట్టాయి. 2020 నవంబరులో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) ఒప్పందంపై ఇవి సంతకాలు చేశాయి. భారత్ ఒక్కటే దీనిలో చేరడానికి నిరాకరించింది. అమెరికా ఎక్కడ కోపగించుకుంటుందోనన్న భయమే మోడీని దీని నుంచి వెనక్కి లాగింది.
* విజయ్ ప్రసాద్ (వ్యాసకర్త 'లెఫ్ట్‌వర్డ్ బుక్స్' సంపాదకులు- 'ఫ్రంట్‌లైన్' సౌజన్యంతో)










