అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి బైడెన్ చేసిన తొలి వార్షిక ప్రసంగం అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న దుస్థితికి అద్దం పడుతున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల పట్ల నిబద్ధతను చాటుకునేందుకు బైడెన్ దీనిని ఒక అవకాశంగా ఉపయోగించుకున్నారు. కరోనా విపత్తును ఎదుర్కోవడంలో, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ట్రంప్ కన్నా మెరుగు అనిపించినా, విదేశాంగ విధానంలో మాత్రం తేడా ఏమీ లేదని ఆయన ప్రసంగం స్పష్టంగా తెలియజేస్తోంది. దశాబ్దాలుగా అమెరికా అధ్యక్షులు చేస్తూ వస్తున్న వార్షిక ప్రసంగాలు తంతుగా మారిన స్థితిలో బైడెన్ ప్రసంగం దీనికి కొంచెం భిన్నంగా ఉందనే చెప్పాలి. అమెరికా నేడు విపత్తు లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, మహా ఆర్థిక మాంద్యం తరువాత మళ్లీ అంతటి ఆర్థిక సంక్షోభం తలెత్తిందని బైడెన్ చెప్పడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి సంపద కేంద్రీకరణ అన్న మాటలు రావడం. కరోనా, ఆర్థిక సంక్షోభం దెబ్బకు 2 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు పోయాయని, అదే సమయంలో 650 మంది బిలియనీర్ల సంపద లక్ష కోట్ల డాలర్లకు పైగా పెరిగిందని బైడెన్ చెప్పారు. అమెరికాలో వాస్తవిక పరిస్థితిని ఆయన సరిగానే తెలియజేశారు. ఈ అసమానతల పెరుగుదలపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న బైడెన్, దీనికి ఉపశమనంగా అమెరికన్ జాబ్స్ ప్లాన్, అమెరికన్ ఫ్యామిలీ ప్లాన్ అన్న రెండు పథకాలను ముందుకు తెచ్చారు. ఇప్పటికే 1.9 లక్షల కోట్ల డాలర్లతో కరోనా సహాయక ప్యాకేజీని తెచ్చి ఒక్కొక్క అమెరికన్‌కు 1400 డాలర్లు చొప్పున 16 కోట్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించిన బైడెన్ ఇప్పుడీ రెండు ప్రణాళికలకు మరో రెండు లక్షల కోట్ల డాలర్లు కేటాయించాలని నిర్ణయించారు. జాబ్స్ ప్లాన్ కింద దేశంలో రేవులు, విమానాశ్రయాల ఆధునీకరణ, బ్రాడ్‌బాండ్, వంతెనలు, సబ్‌వేలు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఫ్యామిలీ ప్లాన్ కింద అమెరికన్ల విద్య, వైద్యం, శిశు సంక్షేమానికి ప్రాధాన్యమివ్వనున్నారు. వీటికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు కార్పొరేట్లపై పన్నును 21 శాతం నుంచి 28 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. 21వ శతాబ్దిలో అమెరికా గెలవాలంటే సంపన్నులపై పన్నులు వేయక తప్పదని అన్నారు. ప్రపంచంపై అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని సమర్థించుకోవాలంటే అంతర్గత పరిస్థితి మెరుగుపరచుకోవడం అవసరమని బైడెన్ భావించాడు. అందుకే ఒక వైపు అమెరికన్ల సామాజిక, ఆర్థిక పరిస్థితి మెరుగుదలపై దృష్టి సారిస్తూనే, మరో వైపు అమెరికన్ పాలకవర్గాల ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ద్విముఖ వ్యూహాన్ని అనుసరించారు. బైడెన్ ప్రసంగంలో చైనా గురించి ఓ అరడజను సార్లకు పైగా ప్రస్తావించారు. 'నిబంధనల ఆధారంగా నడుస్తున్న అంతర్జాతీయ క్రమాన్ని' చైనా సవాల్ చేస్తోందని బైడెన్ మరోసారి తన అక్కుసు వెళ్లగక్కారు. ప్రపంచంపై సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని చలాయించేందుకు ఉద్దేశించిన ఈ ప్రపంచ క్రమాన్ని అమెరికానే రుద్దింది. అలాంటప్పుడు దీనిని ఏ దేశమైనా ఎందుకు అంగీకరించాలి? చైనాతో ఘర్షణ కోరుకోవడం లేదంటూనే దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి అమెరికా తన యుద్ధ నౌకలను దింపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనాకు వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ వ్యూహంలో కీలక భాగస్వామిగా ఉన్న భారత దేశ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి తన యుద్ధ నౌకలను పంపింది.అమెరికా చెబితే తప్ప ఈ విషయం భారత ప్రజలకు తెలియలేదు. చైనా నెంబర్ వన్ ప్రపంచ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరించిన నేపథ్యంలో ఆ దేశాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతున్నది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణను ఏదో ఘనకార్యమన్నట్లుగా బైడెన్ ప్రకటించడం హాస్యాస్పదం. ఆఫ్ఘనిస్తాన్‌పై రెండు దశాబ్దాలపాటు యుద్ధం కొనసాగించిన అమెరికా 2,400 మంది సైనికులను పోగొట్టుకుని, 2 లక్షల కోట్ల డాలర్లను తగలేసి చివరికి సాధించిందేమిటి? ఇప్పటికీ ఆప్ఘనిస్తాన్‌లో అత్యధిక భూ భాగం తాలిబాన్ల అధీనంలోనే ఉంది. అమెరికా దళాలు వెనక్కి వెళ్లకపోతే దాడులు తప్పవని తాలిబాన్లు హెచ్చరించడంతో అది తన బలగాలను వెనక్కి తీసుకుంటోంది. ఇది ఒక రకంగా అమెరికా ఓటమి అనే చెప్పాలి. అమెరికా ఆధిపత్యవాదాన్ని రష్యా, చైనాతో సహా పలు దేశాలు ఇప్పటికే బాహాటంగా సవాల్ చేస్తున్నాయి. అన్యాయమైన, వివక్షాపూరితమైన ప్రస్తుత ప్రపంచ క్రమాన్ని కాపాడుకునేందుకు బైడెన్ ఆరాటపడుతున్నారు. ఆయనకు ఈ విషయంలో భంగపాటు తప్పదు.










