
* రూ.కోట్ల విలువ చేసే భూములు అక్రమ రిజిస్ట్రేషన్
ప్రజాశక్తి- ఆమదాలవలస: మండలంలో తోటాడ రెవెన్యూ పరిధిలో జగన్నాధ స్వామి బావాజీ మఠం భూములపై అమ్మ కన్ను పడడంతో కోట్ల విలువ చేసే భూములు తన అనుచరుల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. శనివారం ఆ స్థలంలోకి సూమరు 20 మంది జిమ్ యువకులను వెంట బెట్టుకొని ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి అమ్మ నమ్మినబంటు, ఆమదాలవలస మండలా నికి చెందిన ఓ సర్పంచ్ అక్కడకు వెళ్లారు. దీంతో బావాజీ మఠానికి చెందిన వారు అక్కడకు చేరుకోవడంతో వారి మధ్య వివాదం నెలకుంది. శ్రీకాకుళం జగన్నాథస్వామి, పీఠధిపతుల ఆధీనంలో ఉన్న 199 ఎకరాల భూములపై గత కొంతకాలం నుండి అధికార పార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మఠానికి చెందిన అర్చకులు మధ్య గతకొంత కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఈ భూములపై భారీస్థాయిలో వివాదం చెలరేగి రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం కావడంతో ఏకంగా సిఎంఒ కార్యాలయం నుండి దీనిపై ఆరా తీయడం, చివరికి మఠాధిపతులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం ఈ బావాజీ మఠం భూముల వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ శనివారం బావాజీ మఠం భూముల్లో వివాదం చెలరేగింది. మళ్లీ మఠంభూములు వ్యవహారం వివాదాలుగా మారి కొత్త రిజిస్ట్రేషన్లు తెరమీదకు వచ్చాయి. ఈ ప్రాంతానికి చెందిన సుమారు 5 ఎకరాల 60 సెంట్లు భూమి సుభాష్ పండ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేశారని, పనులు ప్రారంభించడానికి ఒక వర్గం వారు శనివారం చేరుకోగా జగన్నాథస్వామి మఠంకు చెందిన వ్యక్తులు చేరుకున్నారు. ఆమదాలవలస ఎస్‌ఐ వై.కృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకొని ఇరువర్గాల వారిని పత్రాలతో సాయంత్రం ఐదు గంటలకు స్టేషన్‌కు రావాలని తెలిపారు. ఈ సంఘటనపై జగన్నాథ స్వామి ఆలయ అర్చకుడు సంతోష్ బ్రహ్మ విలేకరు లతో మాట్లాడుతూ ఇప్పటివరకు 11మంది మఠాధిపతులు మారారని, వందల సంవత్సరాల నుండి తోటవాడ రెవెన్యూ గ్రామానికి చెందిన 121వ సర్వే నెంబరులో 199 ఎకరాల భూమి ములుగు బావాజీ పీఠాధిపతి ఆధీనంలో ఉండేవని ఆయన తెలిపారు. అయితే సుభాష్ పండ అనే వ్యక్తి బావాజీ అంటూ చెప్పుకుంటూ తోటవాడ రెవెన్యూ గ్రామంలో లేని 120 పి సర్వే నెంబర్‌తో తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. ఆమదాలవలస నియోజ కవర్గానికి చెందిన ఒక రాజకీయ నాయకుని ప్రొద్భలంతో కొంతమంది రౌడీమూకలు తమపై దౌర్జన్యం చేస్తూ జెసిబిలు ఇతర యంత్రాలతో తమ పంటలను నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు జిల్లాలో జరుగుతున్న భూదందాలపై చర్యలు చేపట్టి తమలాంటి అర్చకులను రక్షించడంతో పాటు మఠాలకు చెందిన భూములను కూడా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. పోలీసులు కూడా ఇరువర్గాల పత్రాలను పరిశీలించకుండా రాజకీయ నాయకుల ఆదేశాలకే వత్తాసు పలుకుతున్నారని సంతోష్ బ్రహ్మ ఆరోపించారు.