Nov 07,2023 00:34

వినతులను స్వీకరిస్తున్న జెసి నవీన్‌

* సాగునీరు ఇవ్వాలని రైతులు వినతి
* మ్యుటేషన్‌ జారీలో జాప్యంపై ఫిర్యాదు
* స్పందనలో వినతులను స్వీకరించిన జెసి నవీన్‌
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
ఆమదాలవలస మండలం అక్కివరం-తోటాడ గ్రామాల్లో ఉన్న బాబాజి మఠం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని కొర్ను పాపారావు, బి.వి.రవి, మఠం ఉత్తరాధికారి లక్ష్మణదాస్‌లు ఫిర్యాదు చేశారు. ఈ భూముల్లో ఆక్రమణలు తొలగించాలని వినతిపత్రాలను అందజేశారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందనలో జాయింట్‌ కలెక్టర్‌ ఎ.నవీన్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నగర పరిధిలో పేదలకు ప్రభుత్వం ఇస్తున్న 90 రోజుల జగనన్న ఇళ్ల పట్టాల జారీలో తహశీల్దార్‌ కార్యాలయం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న 522 మందిలో 160 మందికి మాత్రమే పట్టాలిచ్చి మిగిలిన వారికి పట్టాలు ఇవ్వకుండా నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని నగరానికి చెందిన బి.వి.ఎస్‌.రాజు ఫిర్యాదు చేశారు.కొత్తూరు మండలం నివగాంలో భూముల మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని భగవతిరావు ఫిర్యాదు చేశారు. నందిగాం మండలం హరిదాసుపురం, కణితూరు తదితర గ్రామాల్లో అనర్హులుగా చూపిస్తూ పింఛన్లు తొలగించారని, వాటిని పునరుద్ధరించాలని ఎంపిటిసి శ్యామలరావు ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల మండలం దుప్పలవలసలో తాతల నాటి సర్వే నంబరు 185లోని ఆరు సెంట్లు ఇంటి స్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు స్థానికులు అడ్డు కుంటున్నారని, రెవెన్యూ, పోలీస్‌శాఖల సహకారంతో ఆ స్థలాన్ని ఇప్పించాలని సీర పద్మ ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత, సామాజిక అవసరాలు పరిష్కరించాలని కోరుతూ స్పందనలో 320 వినతులు అందజేశారు. సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, ఇంఛన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితర శాఖలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో జెసి మాట్లాడుతూ వచ్చిన వినతులను పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు సేవకులుగానే భావించి జవాబుదారీగా పనిచేయాలన్నారు. వినతులు ఇచ్చిన లబ్ధిదారులు సంతృప్తి చెందేలా అధికారులు ఇచ్చిన సమాధానం ఉండాలన్నారు. ఒకే అంశంపై తరచూ ఫిర్యాదులు రావడానికి గల కారణాలు పరిశీలించి లబ్ధిదారులకు సమగ్ర సమాచారంతో కూడిన సమాధానం ఇవ్వాలన్నారు. స్పందనలో డిఆర్‌ఒ గణపతిరావు, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, డెప్యూటీ కలెక్టర్‌ జయదేవి వినతులను స్వీకరించారు. వారిలో పాటు జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్‌.వెంకటరామన్‌, గృహనిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్‌.గణపతి, జిల్లా ఉద్యానవన అధికారి ఆర్‌.వి.వరప్రసాదరావు, జిల్లా సరఫరాల అధికారి డి.వి.రమణ, సమగ్ర శిక్షా అదనపు పథక సమన్వయకర్త డాక్టర్‌ ఆర్‌.జయప్రకాష్‌, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జి.వి.చిట్టిరాజు పాల్గొన్నారు.