Jun 09,2023 23:35

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులో మొక్కల పంపిణీ నిలిచింది. సామాజిక అటవీశాఖ గుంటూరు డివిజన్‌ కార్యాలయం ఎత్తివేయడంతో మొక్కల పంపిణీ బాధ్యత ఎవరికి అప్పగిస్తారన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు కార్పొరేషన్‌లో ఏటా లక్ష మొక్కలు నాటుతున్న చెబుతున్నా 10 శాతం మొక్కలకు పరిరక్షణ జరగడం లేదు. నగరంలో ప్రధాన వీధుల్లో ఎక్కడ ఒక భారీ వృక్షం కూడా లేదు. ఎండతీవ్రత తట్టుకోలేక ప్రజలు చెట్లకింద చేరేందుకు అనువైన పరిస్థితులు లేవు. ప్రధాన రహదారుల్లో భారీ వృక్షాలను తొలగించడం, వాటి స్థానంలో మొక్కలు నాటకపోవడం, నాటినా వాటిని సంరక్షించకపోవడంతో గుంటూరులో ఆహ్లాదం ఎండమావిగా మారింది.
గ్రామీణ ప్రాంతాల నుంచి గుంటూరు వచ్చిన వారికి కనీస నిలువనీడ కరువైంది. బస్‌ షెల్టర్లు లేవు. షెల్టర్ల వద్ద బస్సులు ఆగవు. పల్నాడు బస్టాండ్‌ వద్ద నిత్యం వందలాది బస్సులు వచ్చి వెళ్తుంటాయి. 50 వేల మంది ప్రయాణికులు ఈమార్గంలో ప్రయాణిస్తుంటారు. గుంటూరు-మాచర్ల, గుంటూరు-ఒంగోలు, గుంటూరు-పర్చూరు మార్గంలో వెళ్లే బస్సులన్నీ పల్నాడు బస్టాండ్‌కు వచ్చి వెళ్తుంటాయి. ఇక్కడ ప్రయాణికులు రోడ్డుపై నిలబడి బస్సులు ఎక్కి వెళ్లాల్సిందే. ఎంత ఎండవున్నా కనీసనీడ దొరకదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు-విజయవాడ మార్గంలో జాతీయ రహదారికి అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లులలోకూడానీడ కరువైంది. వివిధ ప్రాంతాల నుంచి మార్కెట్‌ సెంటర్‌కు వచ్చే బస్సుల నుంచి దిగిన ప్రయాణికులు దుకాణాల ముందు ఉండే నీడన చేరాల్సివస్తుంది.
లాడ్జి సెంటర్‌, అమరావతి రోడ్డు, గుంటూరు-తెనాలి మార్గం, గుంటూరు-పేరేచర్ల, గుంటూరు -పలకలూరు, గుంటూరు-గోరంట్ల మార్గాల్లో ఒక్క భారీ చెట్టు లేకుండా రహదారుల విస్తరణలో తొలగించారు. మళ్లీ కొత్త మొక్కలను చెట్లుగా మార్చిన ధాఖలాలు లేవు. గుంటూరులో డివైడర్లపై నీడనివ్వని మొక్కలునాటి కార్పొరేషన్‌ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఆర్‌టిసి బస్టాండు ఎదుట ప్రయాణికులు రోడ్డుపై ఎండలో నిలబడి బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఇదేపరిస్థితి బి.ఆర్‌ స్టేడియం వద్దకూడా ఎదురవుతోంది. గుంటూరు - బాపట్ల - చీరాల, రేపల్లె, పొన్నూరు, తెనాలి వెళ్లే ప్రయాణికులు కూడా సరైన షెల్టరు లేక ఇబ్బంది పడుతున్నారు.
సామాజిక అటవీశాఖ ఆద్వర్యంలో పేరేచర్లలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన నగరవనం జనాదరణకు నోచుకోవడం లేదు. దీని నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పర్యాటకులు లేక కళావిహీనంగా మారింది. 63.31 హెక్టార్ల విస్తీరణంలో నిర్మించిన నగర వనం అభివృద్ధికి నోచుకోక వెలవెలబోతోంది. పేరేచర్లలో 2017వ సంవత్సరం నవంబర్‌ 4వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన నగర వనాన్ని నాలుగేళ్లుగా అభివృద్ధి చేయడం లేదు.