Jul 17,2023 22:33

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణం లక్ష్యం మేరకు ఎప్పటికి వేగం పుంజుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గతేడాది జిల్లాలో తొలి విడత 66,386 ఇళ్ల నిర్మాణానికి అనుమతివ్వగా 13,341 ఇళ్లను పూర్తి చేసి ఉగాదికి సామూహిక గృహ ప్రవేశాలు చేయాలనే లక్ష్యం నెరవేరలేదు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు అతికష్టం మీద పట్టణ ప్రాంతాల్లో 10, 337 పూర్తి చేశారు. ఇంకా మూడు వేల గృహాలు పూర్తి చేయాల్సి ఉండగా ఇవి వివిధ దశలో ఉన్నాయి. మొత్తం గృహాల్లో కేవలం పది వేలు పూర్తి చేయగా ఇంకా 56 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది.
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులపై వత్తిడి పెంచుతోంది. జిల్లా కలెక్టర్‌ ప్రతివారం సమీక్ష చేసి పురోగతిపై అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. లబ్ధిదారులు మాత్రం తమ వద్ద ఆర్ధిక స్థోమత లేదని మీరు కట్టి ఇవ్వండి అని సొంతంగా నిర్మాణానికి వెనుకంజ వేస్తున్నారు. నిర్మాణ వ్యయం పెరగడంతో రూ.లక్షా 80 వేలతో ఇల్లు పూర్తి చేయడం అసాధ్యమని లబ్ధిదారులు చెబుతున్నారు.
ఇళ్లనిర్మాణం లబ్ధిదారులకు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా రూ.35 వేలు రుణంగా ఏర్పాటు చేసినా నిర్మాణానికి సరిపోవడం లేదన్న వాదన విన్పిస్తుంది. దాదాపు ఏడాది కాలంగా యంత్రాంగం మొత్తం శ్రమిస్తే నిర్మించిన కేవలం 10,337 ఇళ్లు పూర్తి చేయగలిగారు. లే అవుట్‌లలో ఇళ్ళ నిర్మాణాలకు నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించేలా ప్రత్యేక అధికారులు, హౌసింగ్‌, ఇతర శాఖల మండల స్థాయి అధికారులపై అధికారులు వత్తిడి తెస్తున్నారు. అయినా లబ్ధిదారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. లేఅవుట్‌లో లబ్ధిదారుల వారీగా సచివాలయ సిబ్బందితో మ్యాపింగ్‌ చేసి వత్తిడి పెంచినా పురోగతి తక్కువుగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ.లక్షా 59 వేలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు ఇస్తుంది. మొత్తం రూ.2.15 లక్షలతో ఇళ్లుపూర్తి కాని పరిస్థితి నెలకొంది. ప్రతి లబ్ధిదారుడు సొంతంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అదనంగా వెచ్చిస్తే తప్ప ఇళ్లు పూర్తి కాని పరిస్థితి నెలకొంది.
ప్రధానంగా నిర్మాణ ఖర్చుల్లో భాగంగా కూలీలకు ఎక్కువగా వెచ్చించాల్సి రావడంతో ఆర్థిక స్థోమత లేని వారు ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసుకోలేకపోతున్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రధానంగా రహదారులు లేకపోవడంతో జగనన్న కాలనీల్లోకి వెళ్లేందుకు లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేక ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారు నివశించేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఆయాశాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సదుపాయాల కల్పనలో జాప్యం జరుగుతుందన్న విమర్శలు లేకపోలేదు. కాలనీలకు వెళ్లే అప్రోచ్‌ రహదారులు సరిగా లేక నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నియోజకవర్గం మంజూరు పూర్తయినవి
గుంటూరు తూర్పు 9619 1316
గుంటూరు పశ్చిమ 12,182 733
ప్రత్తిపాడు 10291 1480
తాడికొండ 5654 1634
మంగళగిరి 3025 1210
పొన్నూరు 7961 1650
తెనాలి 17393 2314