ప్రజాశక్తి-బాపట్ల: దేశంలో పెద్ద నగరాల స్థాయిలో బాపట్లను అభివృద్ధి చేస్తానని, అందుకు ప్రజల సహకారం అవసరమని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. శనివారం బాపట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ ప్రారంభ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ బాపట్లను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళుతున్నామన్నారు. ఆ క్రమంలోనే రానున్న రోజుల్లో పెరుగుతున్న జనాభాకు, అవసరాలకు అనుగుణంగా పట్టణంలో రహదారులు విస్తరణ చేసి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు 20 రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం నిర్వహిస్తోందని అన్నారు. అందుకు అవసరమైన నెట్టుడు బళ్ళు (పుష్ కాట్స్) పొక్లెయిన్‌లతో పాటు అదనపు సిబ్బందిని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రప్పించినట్లు తెలిపారు. వార్డుల్లో పూర్తిస్థాయిలో మురుగు కాలువలు శుభ్రపరిచేందుకు కాల్వలపై పరిచిన రాళ్లను తొలగించి పనులకు ఆటంకపరచకుండా ప్రజలు సహకరించాలన్నారు. 20 రోజులపాటు నిర్విరామంగా జరిగే పారిశుధ్య పనులతో పట్టణంలో మురుగునీటి పారుదల సమస్య తొలుగుతుంద న్నారు. ప్రధానంగా ఈ పారిశుధ్య స్పెషల్ డ్రైవ్‌తో కొంతమేర దోమలను నివారించగలమన్నారు. యేడాది క్రితం పట్టణంలో రహదారులు ఇరుకై ట్రాఫిక్ సమస్య తలెత్తేదని, ముందు చూపుతో రహదారుల విస్తరణను చేపట్టామని అన్నారు. మున్సిపల్ కమిషనర్‌గా భానుప్రతాప్ బాపట్లకు రావడంతో రోడ్ల విస్తరణ పనులు కూడా సమర్థవంతంగా చేపట్టగలిగామన్నారు. ప్రధానంగా జీబిసి రోడ్డు విస్తరణకు ఆ ప్రాంత స్థలాల యజమానులకు నష్టపరిహారంగా టిడిఆర్ బాండ్లు అందజేశామని తెలిపారు. రైల్వే స్టేషన్, డిఎస్పీ కార్యాలయం, పాత బస్టాండ్ వరకు విస్తరణ సమస్యలు ఎదురైనప్పటికీ సామరస్యంగా వాటిని పరిష్కరించి పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించగలిగా మన్నారు. బాపట్లను ప్రత్యేక పట్టణంగా తీర్చిదిద్దాలనే ఆలోచనా విధానంతో ముందుకెళుతున్నామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక పలువురు విమర్శలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధికి సహకరించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ పట్టణంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ యథాతథంగా కొనసాగుతుందన్నారు. మధ్యాహ్నం నుంచి ప్రత్యేక డ్రైవ్ పనుల్లో పాల్గొంటారన్నారు. పట్టణంలో ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్ డిఈ శ్రీనివాసులు, డిపిఓ లక్ష్మీ, 34 వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










