Jul 25,2023 00:24
మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆర్య

ప్రజాశక్తి-బాపట్ల: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం బాపట్ల పాత బస్టాండ్‌ వద్ద ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆర్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పాఠ్య పుస్తకాలను ఇవ్వకుండా, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. నాడు-నేడు పేరుతో విద్యా వ్యవస్థనే మార్చేస్తున్నాం అని చెప్పే పాలకులు విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా కళాశాలలో మౌలిక వసతులు కల్పించలేని ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. పుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారు. గత ప్రభుత్వం పేద విద్యార్థులకు కడుపు నింపడం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేసి విద్యార్థులు కడుపు కొట్టారని మండిపడ్డారు. వైసిపి అధికారంలోకి వస్తే జూనియర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోగా ఉన్న పోస్టులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వెంటనే టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, ప్రిన్సిపల్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. గతేడాది ప్లస్‌ టు స్కూల్స్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అడ్మిషన్లు చేసి వారికి చదువు చెప్పేందుకు అధ్యాపకులు నియమించ లేదని ఫలితంగా ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో ప్లస్‌-2 పాఠశాలల్లో పూర్తిగా విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారన్నారు. ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల జీవితాలు నాశనమౌతున్నా యని ప్రభుత్వాన్ని విమర్శించారు. అదేవిధంగా బాపట్ల, నిజాంపట్నం, చందోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, బాపట్ల ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా క్రమంగా ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులను దూరం చేసి, విద్యార్థులు లేరనే కారణంతో శాశ్వతంగా ప్రభుత్వ విద్యను అందించాలనే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించు కోవాలని చూస్తోందన్నారు. ఈ రోజు కేవలం పేద విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుకుంటున్నారు. వారికి విద్యను దూరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అదేవిధంగా జైల్లో ఉండే ఖైదీల కంటే హీనంగా హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలు ఉన్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఐక్యం చేసి ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ మజుందార్‌, అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రాజారాం, బహుజన సమాజ్‌ వాది పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరావు, జనసేన నాయకులు ఆదిశేషు, విద్యావేత్తలు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గరల్స్‌ విభాగం కన్వీనర్‌ నాగలక్ష్మి, నాయకులు రవి, భానుతేజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.