ప్రజాశక్తి-బాపట్ల: ఆశా వర్కర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని సిఐటియు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ అన్నారు. మంగళవారం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కోరుతూ బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆశావర్కర్ల యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం డిఎంహెచ్‌ఓ కార్యాలయ సూపరింటెండెంటుకు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాకు ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి ధనలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మజుందార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోజూ వారి ఆశా వర్కర్ల సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. పని భారం రోజురోజుకీ పెరుగుతోందని అన్నారు. ఆశా వర్కర్లకు సంబంధంలేని పనులు చేయించరాదని అన్నారు. ఆశా వర్కర్ల నియామకాలు ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. అక్రమ తొలగింపులు, వేధింపులు, రాజకీయ జోక్యం నిలువరించాలని పేర్కొన్నారు. విధినిర్వహణలో మరణించిన కుటుంబాలకు ఆశావర్కర్ల నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్, సచివాలయ విధులను ఆశా వర్కర్లతో చేయించరాదన్నారు. ఆశావర్కర్లకు సెలవులు మంజూరు చేయాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని కోరారు. రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. 104 ఉద్యోగుల కోసం ఆశా వర్కర్లతో ఎలాంటి అదనపు ఖర్చులు చేయించరాదని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ ఆశాలకు ఇచ్చిన ఫోన్లు పని చేయటం లేదు. ఆ ఫోన్లతో పని చేయాలని జిల్లాలో అధికారాలు ఒత్తిడి చేస్తున్నారన్నారు. సచివాలయంతో సంబంధం లేకపోయినా సాయంత్రం 5 వరకు సచివాలయంలో ఉండాలనే నిబంధనలు పెడుతున్నారు. ఎన్‌సిడిసిడి సర్వే ఆశా వర్కర్లే చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఆశ వర్కర్లు పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అద్యక్షుడు సిహెచ్ మణిలాల్, జిల్లా ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు వెంకటశ్వరమ్మ, ఝాన్సీ, రాధ, సకీన, సువార్త, సీఐటీయూ జిల్లా నాయకులు జె శామ్యూలు, కె శరత్ పాల్గొన్నారు.










