- అమృత్ అవార్డుకు ఎంపికైన మహంకాళి శ్రీ మన్నారాయణ శర్మ
- ఉపరాష్ట్రపతి చేతులు మీదుగా అవార్డు
- బాపట్ల సీమకే గర్వకారణమం పలువురి ప్రశంస
ప్రజాశక్తి - బాపట్ల
పట్టణానికి చెందిన కూచిపూడి నాట్య కళాకారుడు మహంకాళి శ్రీమన్నారాయణ శర్మకు అరుదైన పురస్కారం లభించింది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేతుల మీదుగా అమృత్ అవార్డును శర్మ అందుకున్నారు. భావపురి కళాకారుడి ప్రతిభకు దక్కిన పురస్కారంగా పలువురు శర్మను ప్రశంసిస్తున్నారు. అమృత అవార్డు గ్రహీత శ్రీమన్నారాయణ శర్మకు సంబంధించి ప్రజాశక్తి అందిస్తున్న సంక్షిప్త కథనం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర సంగీత, నాటక అకాడమీ దేశంలోని కూచిపూడి కళాకారుల్లో 8పదుల వయసున్న మహంకాళి శ్రీమన్నారాయణకు అమృత్ అవార్డును కేంద్ర ప్రభుత్వం బహుకరించింది. కృష్ణా జిల్లా కూచిపూడి మహంకాళి శ్రీమన్నారాయణ యక్షగాన చక్రవర్తి అయిన దివంగత మహంకాళి సత్యనారాయణ, కామాక్షమ్మలకు జన్మించారు. బాల్యం నుండి నాట్యంపై ఎంతో మక్కువ ఉండేది. చిన్నతనంలో ప్రహ్లాదునిగా అద్భుతమైన ప్రదర్శనలిచ్చి మహనీయుల మన్ననలు, సత్కీర్తిని పొందారు. 18వ ఏట బాపట్లకు వచ్చి స్థిరపడ్డారు. సత్య హరిశ్చంద్రలో లోహితాక్షుడుగా, మాతంగ కన్యలుగా, ఉషాపరిణయంలో అనిరుద్దునిగా, దవ్వారికుడిగా, భామాకలాపంలో శ్రీకృష్ణుడిగా, సూత్రదారిగా, అంచెలంచెలుగా అనంత యశోభూషనుణుడై యక్షగాన చక్రవర్తి సార్థక నామ ధేయులయ్యారు. వెంపటి చిన సత్యం నృత్య సంరక్షణలో రూపుదిద్దుకున్న క్షీరసాగర మధనంలో అద్భుతమైన ప్రతిభ చూపిన కళాకారుడుగా మహంకాళి గుర్తింపు పొందారు. నాట్యాచార్యుడుగా రాణించిన మహోన్నత గురువు మహాంకాళి శ్రీమన్నారాయణ శర్మ తిరుగులేని స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కూచిపూడి నాట్యకళలో దాదాపు 30వేల మంది శిష్యులను తయారు చేశారు. ఈయన శిష్యురాలు రమాదేవి హైదరాబాదు కేంద్రంగా నాట్య అకాడమీ స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. శ్రీమన్నారాయణ ప్రతిభకు దక్కిన అసలు సిసలైన గౌరవంగా పలువురు అభినందిస్తున్నారు. మహంకాళి కృషిని ప్రశంసిస్తున్నారు.










