ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నేడు బాపట్ల జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం కలెక్టరేట్‌లో జరుగనుంది. నూతనంగా జిల్లా ఏర్పడ్డాక జరుగుతున్న మూడో సమావేశం ఇది. జిల్లా ఏర్పడి ఏడాది నిండింది. అయినా జిల్లా సమగ్రాభివృద్ధికి చేపట్టిన చర్యలు లేవు. ప్రధానంగా అన్ని అభివృద్ధి పనుల అమలుకు సంబంధించి నిధుల కొరత జిల్లాను వెనుకబాట పట్టిస్తోంది. దీంతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు నేటికీ బాలా రిష్టాలు దాటింది లేదు. అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు కోకొల్లలుగా కొలువుతీరి ఉన్నాయి. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, పర్యటనలతో జిల్లా అధికారులు హడావిడిగా ఉంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. కనీసం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య పంట కాలువలు, మురుగు కాలువల్లో ఉండిపోయిన తూటు కాడను కూడా రెండేళ్లుగా తొలగించలేని దుస్థితి జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజక వర్గాల్లో ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణం కొలిక్కి రాలేదు.
సౌకర్యాల లేమితో జిల్లా కార్యాలయ భవనాలు
పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేసింది. కాని జిల్లా ఏర్పడి ఏడాది నిండినా జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పన అనేది జరగలేదు. జిల్లా ఏర్పడ్డాక అందుబాటులో ఉన్న మానవ వనరుల కేంద్ర భవనాలు, క్వార్టర్లలో జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కాని నేటికీ కావలసిన మేరకు వసతుల కల్పన సమకూరలేదు. గతంలో నిర్మించిన ప్రభుత్వ క్వార్టర్లలో ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, ఎస్‌పి కార్యాలయాలు మాత్రం సౌకర్యాలతో అందుబాటులో కొచ్చాయి. నిధులు అందుబాటులోకి రాకపోవడంతో జిల్లా అధికారులు ఉసూరుమంటూ విధులు నెట్టుకొస్తున్నారు. నూతనంగా జిల్లా కార్యాలయ భవనాల కోసం స్థల సేకరణ నేటికీ జరగలేదు. జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలంటే రవాణా, విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు లాంటి రంగాలపై దృష్టి పెట్టాలి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం జరగాలి. ఇందుకు నిధులు కావాలి. జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలతో జిల్లా వైద్యశాల ఏర్పాటు కావాల్సి ఉంది. బాపట్ల, చీరాలలో ప్రాంతీయ వైద్యశాలలు ఉన్నాయి. కాని అత్యవసర వైద్యసేవల కోసం గుంటూరు లేదా విజయవాడ వెళ్లాల్సి వస్తోంది. బాపట్లలో రూ.550 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, 300 పడకలతో బోధనాసుపత్రి, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అవి ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో అర్థంకాని స్థితి నెలకొంది. అలానే జిల్లా పరిధిలో విజయవాడ-చెన్నె జాతీయ రహదారి ఉంది. నార్కెట్‌పల్లి- అద్దంకి ఎక్స్‌ప్రెస్ హైవే ఉంది. వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారి ఉంది. ఈ రహదారుల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసర చికిత్స కోసం జిల్లా కేంద్రం బాపట్లతో పాటు అద్దంకి, మార్టూరు, పర్చూరుల్లో ఉన్న వైద్యశాలల్లో ట్రామాకేర్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లా కేంద్రానికి రవాణా సదుపాయం అంతంత మాత్రంగా ఉంది. బాపట్లకు ప్రజలు సులభతరంగా వచ్చేందుకు వీలుగా నియోజకవర్గ కేంద్రాలు ముఖ్యమైన గ్రామాల మీదుగా ఆర్‌టిసి బస్సు సర్వీసులు నడపాలి. ఉద్యోగులు, ప్రజల సౌకర్యార్థం గుంటూరు, తెనాలి నుంచి బాపట్లకు నాన్‌స్టాప్ బస్సు సర్వీసులు నడపాలి. జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పంట పొలాలకు సాగు నీరందకపోవడం. పంట కాలువలు, మురుగు కాలువల్లో విపరీతంగా తూడుకాడ పెరిగిపోయింది. కాలువల్లో పూడికలను తీయలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిధులు లేక ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. బాపట్ల జిల్లా పర్యాటక రంగానికి అనుకూలమైంది. 74 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. ప్రకృతి సిద్ధమైన మడ అడవులు ఉన్నాయి. సూర్యలంక, వాడరేవు, రామాపురం బీచ్‌లు ఉన్నాయి. తీరంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో రీసార్టుల ఏర్పాటు ద్వారా మరింతగా ఆదాయం సమకూరుతుంది. వాయుసేనకు చెందిన మ్యూజియం ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో పాటు పలురకాల పార్కు నిర్మాణాల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవలసిఉంది.
నెరవేరని గత సమావేశం నిర్ణయాలు
గతేడాది డిసెంబరు 6న జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పాల్గొని జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. నిధులు సత్వరమే మంజూరవుతాయన్నారు. కాని నేటికీ అరకొరగానే నిధులు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు పనులు చేయలేని పరిస్థితి ఉంది. జిల్లాలో నాడు-నేడు కార్యక్రమం లో గ్రామ సచివాలయ భవనాలు, ఆర్‌బికెలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, బల్‌క మిల్క్ యూనిట్స్ నిర్మాణాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. కాని ఈ ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఏడాది కాలంగా బిల్లులు విడుదల కాలేదు. జిల్లాకు దాదాపు రూ.20 కోట్ల బిల్లులు రావలసి ఉంది. జిల్లాలో జల జీవన్ మిషన్ పథకం కింద చేపట్టిన పనులు నిధుల లేమిలో ముందుకు సాగడం లేదు. తుఫాను పంట నష్ట పరిహారం నగదు అరకొరగానే ఇచ్చారు. ప్రధానం గా గ్రామ పంచాయతీలు నిధులు లేక కునారిల్లిపోతున్నాయి. నేడు జరుగుతున్న జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో అయినా జిల్లా సమగ్రాభివృద్ధికి నిధుల మంజూరుకు అవకాశం లభిస్తుందేమో చూడాల్సి ఉంది.










