Jul 18,2023 23:52
బాపట్ల నియోజకవర్గ అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇన్‌ ఛార్జ్‌ మంత్రి కొట్టు సత్యనారాయణ

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: బాపట్లనియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ లోని స్పందన హాల్‌లో బాపట్ల నియోజకవర్గ అభివృద్ధి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన పరిపాలన, ఆర్థిక పరమైన అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్‌ రోడ్డు మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణా లకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో నాలుగు, ఐదు నెలల్లో రోడ్డు పనులు పూర్తవుతా యన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మండలా నికి రూ.60 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్లు, సైడ్‌ కాలువ నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన చెప్పారు. జిల్లాలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కింద సచివాలయానికి రూ.20 లక్షల నిధులు విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి హామీ మేరకు రూ.18 కోట్లతో రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మించడానికి భూసేకరణ చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలో రూ.10 కోట్లతో అంతర్గత రోడ్లు నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలో సొసైటీల కింద ఉన్న భూములను రద్దు చేసి సాగుచేసుకుంటున్న 611 మందికి 522 ఎకరాలు భూములు వ్యక్తిగత పట్టాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, జాయింట్‌ కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మి శివ జ్యోతి, సిపిఓ భరత్‌ కుమార్‌, డిఆర్‌డిఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అర్జున్‌, డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శంకర్‌నాయక్‌, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌, వ్యవసాయ శాఖ జెడి అబ్దుల్‌ సత్తార్‌, పశుసంవర్ధక శాఖ జెడి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.