Mar 28,2021 06:31

కామ్రేడ్‌ బాపనయ్య 1978 మార్చి 25వ తేదీ రాత్రి తుది శ్వాస విడిచాడు. ఆయన మనకు దూరమై 43 సంవత్సరాలు గడిచాయి. అయినా ఆయన పోరాట స్మృతులు మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. బాపనయ్య అట్టడుగు దళిత కులంలో పుట్టి కుల వివక్షతతో అనేక అవమానాలు పొందుతూ అవనిగడ్డ హైస్కూల్లో చదువుకుంటున్న రోజులవి. సొంత ఊరు నాగయతిప్ప నుంచి అవనిగడ్డ స్కూలుకి వెళ్ళాలంటే పడవ ఎక్కి వెళ్ళాలి. కానీ ఒకరోజు దళితుడు కాబట్టి బాపనయ్యను పడవ ఎక్కకుండా అగ్ర కులస్తులు అడ్డగించారు. ఆ పడవ పైనున్న మాకినేని బసవపున్నయ్య ఇది చూసి...కుల వివక్షతకు వ్యతిరేకంగా ఆందోళన చేసి బాపనయ్యను పడవ ఎక్కించి రేవు దాటించాడు. ఈ ఘటన నాగయతిప్పలో పెద్ద సంచలనం కలిగించింది. ఆ రోజు బాపనయ్య ఒక్కడే పడవ దాటినా తదనంతరం దళితులందరికి పడవ ఎక్కే అవకాశం దక్కింది. ఈ సంఘటన బాపనయ్యను ఆలోచింపజేసింది. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడేది కమ్యూనిస్ట్‌ పార్టీయేనని అర్థం చేసుకొని చదువు పూర్తయిన అనంతరం కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరాడు. ఒక సామాన్య కార్యకర్తగా పని చేయనారంభించి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎదిగి...తుది శ్వాస విడిచే వరకు పని చేశాడు. 1952లో దివి నియోజక వర్గం నుండి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1962, 1978లో శాసన సభ్యుడిగా నిడుమోలు నియోజక వర్గం నుండి ఎన్నికయ్యాడు. 1968 నుండి 1972 వరకు శాసన మండలి సభ్యుడిగా పని చేశాడు. కొంతమందికి పదవి అలంకారం అయితే పదవికే అలంకారం తెచ్చిన వ్యక్తి బాపనయ్య.


1938లో కాకినాడలో పి.ఆర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న కాలంలోనే విద్యార్థి సంఘంలో పని చేశాడు. సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి (1939లో) పని చేయడం మొదలెట్టాడు. 1940లో కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యత్వం తీసుకుని దివి తాలుకాలో వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటులో అగ్ర భాగాన నిలబడ్డాడు. నాడు చల్లపల్లి రాజా జమీందారీ దోపిడి విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించాడు. భూస్వాముల దోపిడి అతి క్రూరంగా ఉండే రోజులవి. భూస్వాములు పాలేర్ల, వారి కుటుంబ సభ్యుల శ్రమను కూడా అప్పణంగా కాజేసేవారు. శ్రమకు తగ్గా ఫలితం ఉండేది కాదు. పిచ్చి కొలతలతో, తప్పుడు తూకాలతో పాలేర్లకు ధాన్యం కొలిచేవారు. పాలేర్ల జీతాల పెంపుదలకు, తప్పుడు తూకాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేసి విజయం సాధించారు. అతి తక్కువగా ఉన్న కూలీ రేట్ల పెంపుదల కోసం పోరాడి సాధించారు. దున్నే వానికే భూమి కోసం పోరాటం చేసి చల్లపల్లి రాజా భూముల పంపిణీకి మూల కారకుడయ్యాడు. భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వ్యవసాయ కూలీల జీవితాలు బాగు చేయడానికి కృషి చేస్తూనే కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి దళితులందరిని ఎర్రజెండా చెంతకు చేర్చిన వ్యక్తి బాపనయ్య.


బాపనయ్య గారి కాలం నాటి రోజులు నేడు లేవు. కుల వ్యవస్థలో, అంటరానితనం పాటించడంలో చాలా మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఏదోక రూపంలో అంటరానితనం, వివక్షత కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వల్ల పాలేరు వ్యవస్థ రద్దయిపోయింది. వ్యవసాయ కార్మికులు వేతన కూలీలుగా మారారు. నేడు పొట్ట గడవడానికి గ్రామాలు వదిలి వలసలు పోతున్నా కడుపు నింపుకోవడం గగనమవుతున్నది. దున్నేవానికే భూమి నినాదంతో రైతాంగ పోరాటాలు ఆనాడు ఉవ్వెత్తున లేచాయి. వీర తెలంగాణ విప్లవ పోరాటంలో కమ్యూనిస్టులు లక్షల ఎకరాల భూములు పంచారు. ఇది చూసిన ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తానే భూములు పంచుతాననీ, వ్యవసాయ సంస్కరణల పేరుతో భూసంస్కరణ చట్టం తెచ్చి భూమిని అంతంత మాత్రంగానే పంచింది. దాంతో దళితులను, అట్టడగు వ్యవసాయ కూలీలను సమీకరించి వ్యవసాయ కార్మిక సంఘం భూపోరాటాలు చేస్తూనే ఉంది. కృష్ణా జిల్లాలో అసైన్డ్‌ భూములు, లంక భూములు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలువ భూములు, కడపలో వేలాది ఎకరాల బంజరు భూములకు సంబంధించి రాష్ట్ర వ్యాపితంగా 6 జిల్లాల్లో భూపోరాటాలు చేస్తూ బాపనయ్యగారి బాటలో కొనసాగుతున్నది.


నేడు సరళీకరణ విధానాల అమలుతో వ్యవసాయ రంగంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పుల వల్ల వ్యవసాయ కూలీల జీవితాలు, ముఖ్యంగా మహిళల జీవితం దుర్భరంగా మారుతున్నది. ఒకప్పుడు సంవత్సరంలో 200 రోజులు పని దినాలు ఉండేవి. 2000 సంవత్సరం వచ్చే సరికి 100 రోజులకు పడిపోయాయి. నేడు నిండా రెండు నెలలు కూడా పనులు దొరకడం లేదు. వ్యవసాయంలో ఆకు మడి వేయడం, దుక్కి దున్నడం, నాట్లు వేయడం పోయి సగం వ్యవసాయం... ఎదజల్లే పద్ధతి లోనే సాగుతున్నది. మహిళలు పెద్ద ఎత్తున పనులు కోల్పోతున్నారు. నేడు వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల, స్త్రీ, పురుషులకు పనులు బాగా తగ్గిపోతున్నాయి. దీంతో వ్యవసాయ కార్మికులు పనులు వెదుక్కుంటూ వ్యవసాయేతర కార్మికులుగా, గ్రామీణ శ్రామికులుగా మారుతున్నారు. వ్యవసాయ కార్మికుల, దళితుల బిడ్డలు చదువుకుని ఉపాధి లేక నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. ఇలావుండగా, నేటి పాలకులు భూసంస్కరణ చట్టానికి తిలోదకాలిచ్చి ''సెజ్‌''ల పేరుతో ఒక్కొక్క వ్యక్తికి వేలాది ఎకరాలు కట్టపెడుతున్నారు. పెట్టుబడిదారీ భూస్వాములను తయారు చేస్తున్నారు. వస్తున్న మార్పుల నేపథ్యంలో సమగ్ర అధ్యయనం, పరిశీలన చేయాల్సిన అవసరముంది. వ్యవసాయ కార్మికులను చైతన్యవంతులను చేసి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బాపనయ్య స్ఫూర్తితో పోరాటాలు కొనసాగించాలి.


బాపనయ్య అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందిన నాయకుడు. దళితుడిగా పుట్టినా ఆయన చేసిన పోరాటాలు, త్యాగాల వల్ల...అన్ని సామాజిక తరగతుల ప్రజలు ఆయనను అభిమానించి, ఆదరించేవారు. దళితుల ఇళ్ళల్లో ఎంత చనువుగా మసిలేవాడో అగ్రకులాల ఇళ్ళల్లో కూడా అంతే చనువుగా వ్యవహరించేవాడు. ప్రజల మధ్య ఉంటే ప్రజలే ఆదరిస్తారు, ప్రజలే పోషిస్తారు అనే దానికి బాపనయ్య జీవితం మనకు ఆదర్శం. నీటిలో చేపలాగ మనం ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాడుతూ వారిని చైతన్యవంతులను చేయగల్గితే మరల ఎర్రజెండా రెపరెపలను మనం చూడగల్గుతాం. ఆనాడే మనం కామ్రేడ్‌ బాపనయ్య ఆశయాన్ని కొనసాగించిన వాళ్ళమవుతాం.
(29వ తేదీన చల్లపల్లిలో బాపనయ్య వర్థంతి సభ సందర్భంగా)
- దడాల సుబ్బారావు /వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు/