ప్రజాశక్తి - ఏలూరు
జమిందారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి పేదలకు భూమి సాధించిపెట్టిన మహానేత నేత గుంటూరు బాపనయ్య అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. బాపనయ్య 45వ వర్థంతి సభ వ్యకాస ఆధ్వర్యంలో ఏలూరులో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపనయ్య చిత్రపటానికి రవి, శ్రీనివాస్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దివిసీమ ఉప్పెన వంటి విపత్కర పరిస్థితుల్లో పేదలందరికీ అండగా ఉండి, వైద్యం, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. మూడుసార్లు ఎంఎల్‌ఎగా, ఓసారి ఎంఎల్‌సిగా పనిచేసినప్పటికీ ఆయన జీవితం నిరుపేదగానే సాగిందన్నారు. చాలా మందికి పదవి అలంకారమైతే, పదవికే ఆయన అలంకారం తెచ్చారని పేర్కొన్నారు. నీతికి, నిజాయితీకి, ప్రజాసేవకు మారుపేరు బాపనయ్య అని కొనియాడారు. దివి తాలూకాలో చల్లపల్లి నారాయణరావుతో కలిసి ఆయన వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. 1941లో వెంట్రప్రగడలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణాజిల్లా ప్రథమ మహాసభలో ఆయన కార్యదర్శిగా ఎన్నికయ్యారని, 1942 నుంచి చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా మంగళాపురంలో ముదిరాజులకే బంజరు చెందేలా సాగిన పోరాటానికి సిహెచ్.రాజేశ్వరరావు, చల్లపల్లి నారాయణరావుతోపాటు నాయకత్వం వహించారని తెలిపారు. 1946లో 17 వేల ఎకరాల చల్లపల్లి జమీందారీ భూముల్లో 'గట్ల ఉద్యమానికి' కృషి చేశారన్నారు. 1947లో రాష్ట్రవ్యాప్తంగా పాలేర్ల జీతాల పెంపుదలకూ, పని గంటల తగ్గింపు కోసం జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం రాబోయే కాలంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య పోరాటం మరింత పెరగాలని, భూస్వాముల విధానాలను తిప్పికొట్టి పేదలకు భూమి పంచేలా కృషి చేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, ప్రజాసంఘాల నాయకులు పి.కిషోర్, గుడిపాటి నరసింహారావు, వి.సాయిబాబు, బి.జగన్నాధరావు, ఎ.శ్యామలారాణి, టి.సత్యనారాయణ, జె.గోపి పాల్గొన్నారు.










