ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్
దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో అక్రమంగా బాణాసంచా తయారు చేసే వారిపై జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఒన్‌టౌన్ సిఐ రాజశేఖర్ తెలిపారు. సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మేకల కబేల సెంటర్‌లో అక్రమంగా బాణాసంచా ఇద్దరు వ్యక్తులు తయారు చేస్తున్నారని సమాచారాన్ని పోలీసులు అందుకున్నారు. సమాచారం మేరకు మహమ్మద్ నజీర్ ఇంటిపై ఒకటో పట్టణ సిఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. వారు దాడి చేసిన సమయంలో సురే కారం(పొటాషియం నైట్రేట్) 50 కేజీలు, తారాజువ్వలు-200, దారాల కట్టలు-16, సిసింద్రీ మందు(బ్లాక్పౌడర్) 1/2 కేజీ, మరికొన్ని బాణాసంచా తయారీకి వినియోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహమ్మద్ నజీర్, మహమ్మద్ బషీర్ అనే ఇద్దరు వ్యక్తులపై ఎక్స్‌ప్లజివ్ యాక్ట్ యాప్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు వన్ టౌన్ సిఐ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా బాణాసంచా తయారు చేయడం గాని, నిలువ ఉంచడం కానీ చేస్తే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. తమ ప్రాంతంలో ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వెంటనే డైలీ హండ్రెడ్‌కు గాని, వన్ టౌన్ సిఐకు గాని సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ దాడిలో వన్ టౌన్ ఎస్‌ఐ లక్ష్మణ్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.










