
ప్రజాశక్తి - ఆచంట
ఆచంటలో బాణాసంచా దుకాణాలు వెలవెలబోతున్నాయి. దీపావళి ముందు రోజు శనివారం కూడా కొనుగోలుదారుల కోసం దుకాణదారులు నిరీక్షిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, వ్యవసాయం ఆశాజనకంగా లేకపోవడం బాణాసంచా ధరలు కూడా భారీగా పెరగడమే కారణమని చెబుతున్నారు. దీనికితోడు వాతావరణంలో మార్పులు కూడా వ్యాపారులను మరింత కలవర పెడుతోంది. వేలకు వేలు పెట్టుబడులు పెట్టామని, అమ్మకాలు లేకపోవడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదని బాణాసంచా వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు తాత్కాలిక లైసెన్సుల జారీలో భారీగా ముడుపులు తీసుకున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒక దుకాణానికి లైసెన్స్ తీసుకుని రెండు, మూడు ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా మండలంలో ఎంతమందికి లైసెన్సులు మంజూరు చేశారనే సమాచారం కూడా స్థానిక అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. దుకాణాల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను అనుమతి కోసం ఉన్నతాధికారులకు పంపామని, ఎంతమందికి లైసెన్సులు మంజూరు చేశారనే సమాచారం ఇంకా తమకు రాలేదని స్థానిక అధికారులు చెబుతుండడం విశేషం. అయితే పంచాయతీ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకూ ముడుపులు తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాల్సిన దుకాణాలను ప్రధాన సెంటర్లో, జన సంచారం మధ్య ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోని పరిస్థితి. ఒక్కో దుకాణదారుడు రూ.40 నుంచి రూ.50 వేల వరకూ ముడుపులు చెల్లించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మట్టి ప్రమిదలకు తగ్గిన గిరాకీ..
విజయానికి చిహ్నంగా జరుపుకునే దీపావళి పండుగ రోజున మట్టితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కాస్త స్తోమత కలిగిన కుటుంబాలు భారీగా దీపాలు వెలిగించి తమ దర్పణాన్ని ప్రదర్శిస్తుండేవారు. కాలక్రమంలో లోహంతో చేసిన దీపాలు కొవ్వొత్తుల వినియోగం, విద్యుత్ దీపాలతో అలంకరణలు పెరగడంతో మట్టి ప్రమిదలకు గిరాకీ తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రమిదలు, చిచ్చుబుడ్లు తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రమిదలు, చిచ్చుబుడ్డులను సారేపై తయారు చేస్తామని, వాటిని ఎండలో పెట్టి ఆరిన తర్వాత కాలుస్తామని నిర్వాహకులు సత్యనారాయణ తెలిపారు.
టపాకాయకులకు తగ్గిన ఆదరణ
పెనుమంట్ర : గతంలో గ్రామీణ ప్రాంతాల్లో దీపావళి పండుగకు 15 రోజుల ముందు నుంచే టపాసుల మోత మోగేది. నేడు ఆ సందడే కానరావడం లేదు. గ్రామాల్లో ఎక్కువగా టపాకాయలు కాల్చేవారు. ప్రస్తుతం వాటి తయారీ తగ్గింది. శనివారం ఆలమూరులో కొంతమంది మాత్రమే వ్యాపారులు వాటిని విక్రయిస్తున్నారు. కట్టకు 25 చొప్పున ఉంటాయని, ధర రూ.70 నుంచి రూ.80ల వరకూ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఆలమూరులో వేప పువ్వు సెంటర్, హైస్కూల్ ప్రాంగణంలో ఈ టపాసులను ఏటా పొట్ర కుటుంబానికి చెందిన కొంతమంది మాత్రమే విక్రయిస్తారు. అయితే ప్రస్తుతం అమ్మకాలు అంతగా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డంపింగ్ యార్డు సమీపంలోనే దుకాణాలు
దీపావళి పండుగ నేపథ్యంలో పంచాయతీ ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు సాగుతున్నప్పటికీ అధికారులు దృష్టి సారించకపోవడం పట్ల స్థానికులు విమర్శిస్తున్నారు. ఒక్కో దుకాణానికి నాలుగు మీటర్ల దూరం ఉండాలని అధికారులు చెబుతున్నా వ్యాపారులు కనీస దూరం పాటించడం లేదు. మందుగుండు సామగ్రి దుకాణాల వెనుక డంపింగ్ యార్డు ఉంది. ప్రమాదం ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై అత్తిలి ఫైర్ ఇన్‌ఛార్జి ఎస్‌ఐ కె.వెంకటరెడ్డిని వివరణ కోరగా తమ పరిధిలో 18 లైసెన్స్ ఇచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా పెనుమంట్రలో నాలుగు దుకాణాలకు మాత్రమే లైసెన్స్ ఇచ్చినట్టు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు
కాళ్ల : మండలంలోని పలు గ్రామాల్లో బాణాసంచా దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేవు. బాణాసంచా ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ధరలు రెండు రెట్లు పెరిగాయి. దీంతో అందరూ ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ ధనవంతుల పండుగగా మారిపోయింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు సాధారణ టపాసులకు బదులు హరిత టపాసులు కాల్చాలని అగ్నిమాపక అధికారి వై.నాగేశ్వరరావు సూచించారు. శబ్ధకాలుష్యం లేకుండా ప్రజలంతా సురక్షితంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ఐఎస్‌ఐ మార్కు గల బాణాసంచా మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. పొగను వెదజల్లే మందులను కాల్చకపోవడమే మంచిదన్నారు
మండలంలో 19 షాపులకు అనుమతులున్నాయి. ఆకివీడు ఫైర్‌స్టేషన్ పరిధిలో 32 షాపులకు అనుమతులున్నాయని అగ్నిమాపక అధికారి వై.నాగేశ్వరావు తెలిపారు. కాళ్ల, కాళ్లకూరు, జువ్వలపాలెం, ఏలూరుపాడు గ్రామాల్లో బాణాసంచా దుకాలను పరిశీలించి పలు సూచనలిచ్చారు.