ఏలూరు:బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలుంటాయని, దీనిపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం బాల్య వివాహ నిషేధ చట్టం-2006 ప్రకారం జిల్లాలో బాల్య వివాహాలు నిర్మూలనపై మాసాంతర అవగాహన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి వాల్‌పోస్టర్లను జెసి బి.లావణ్యవేణితో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 16 నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకూ బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బాల్య వివాహాలు జరిపించినా, ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలు చేస్తే జరిగే అనర్థాలను క్షేత్రస్ధాయిలో అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యవివాహాలు చేయకూడదని 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ అమ్మాయిలకు వివాహం చేయకూడదన్నారు. బాలికకు వివాహం చేస్తే వరుడితోపాటు వరుడి తల్లిదండ్రులకు, వధువు తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు పోక్సో చట్టప్రకారం విధించబడే శిక్ష 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకూ జైలు శిక్ష, జరిమానా లేదా జీవితఖైదు కూడా విధించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎవిఎన్‌ఎస్.మూర్తి, ఐసిడిఎస్ ఇన్‌ఛార్జి పీడీ ఆర్.కుముదినీసింగ్, మెప్మా పీడీ ఇమ్మానియేల్, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఎన్‌ఎస్.కృపావరం, డిఆర్‌డిఎ పీడీ ఆర్.విజయరాజు, డిపిఆర్‌ఒ ఆర్‌విఎస్. రామచంద్రరావు, డిసిపిఒ సూర్యచక్రవేణి పాల్గొన్నారు.










