
ప్రజాశక్తి - ఏలూరు
బాల్య వివాహాల నిర్మూలనను సమాజంలోని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కోరారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో 'బాల్యవివాహా రహిత భారతదేశం, బాలల భద్రతే భారత్ భద్రత' నినాదంతో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఏలూరు జిల్లావాసిగా భారతదేశాన్ని బాల్యవివాహ రహితంగా తయారుచేయడానికి, బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని అధికారులు, సిబ్బందితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కలిగించే ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలను నిరోధించడానికి మనమంతా కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలు బాలిక, ఆమె పిల్లల జీవితం, భవిష్యత్తుపై తీవ్రమైన పరిమాణాలు చూపుతాయన్నారు. వీటిని నివారించేందుకు గ్రామస్థాయి నుండి కలిసికట్టుగా పని చేయాలన్నారు. బాల్య వివాహం చేయడానికి సన్నద్ధం అవుతున్నారని తెలిస్తే ముందుగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహం వల్ల పిల్లలపై ఎలాంటి దుష్ఫరిణామాలు పడతాయో వివరించాలన్నారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, ఇందుకు రెండేళ్లు జైలు, రూ.లక్ష జరిమానా విధించబడుతుందని తెలిపారు. బాల్య వివాహాల సమాచారాన్ని 112 లేదా చైల్డ్ లైన్ 1098 నెంబరుకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిఎస్‌పి శ్రీనివాసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ పద్మావతి, డిసిపిఒ సూర్యచక్రవేణి, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్, ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలి, జిల్లా పంచాయతీ అధికారి టి.శ్రీనివాస్ విశ్వనాధ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జివివి.సత్యనారాయణ, సూర్యనారాయణరెడ్డి, జిఎస్‌డబ్ల్యూఎస్ నోడల్ ఆఫీసరు రమణ, ఎపిఇపిడిసిఎల్ ఎస్‌ఇ పి.సాల్మన్ రాజు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.