Mar 21,2021 13:26

చిన్నప్పటి నుంచి భగత్‌సింగ్‌ బ్రిటీష్‌ వారి నిరంకుశత్వం గురించి కథలు కథలుగా వినేవాడు. ఎలాగైనా వారిని దేశం నుంచి వెళ్లగొట్టాలనే భావం అతని మనస్సులో నాటుకుపోయింది. ఆయన మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్‌సింగ్‌ భగత్‌సింగ్‌ను చంకనెత్తుకొని, తన స్నేహితుడు నందకిశోర్‌ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. కొంత సమయం తర్వాత కిందికి దిగిన భగత్‌ సింగ్‌ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్నచిన్న గడ్డిపరకలు నాటడం మొదలెట్టాడు. తండ్రి ''ఏం చేస్తున్నావ్‌ నాన్నా'' అని ప్రశ్నిస్తే, భగత్‌సింగ్‌ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు. భగత్‌సింగ్‌ అన్న మాటలు ఇవి ''తుపాకులు నాటుతున్నా''. పసి వయస్సులోనే తుపాకులను మొల కెత్తించాలనే ఆలోచనే అతని వ్యక్తిత్వానికి మచ్చు తునక. విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు. బాబాయి సర్దార్‌ అజిత్‌సింగ్‌ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్‌ కౌర్‌ను చూసి, నాలుగేళ్ళ భగత్‌సింగ్‌ '' పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా'' అని ప్రతిజ్ఞలు చేసేవాడు.
13 ఏళ్ల వయస్సులోనే మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమానికి భగత్‌సింగ్‌ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్‌ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన భగత్‌సింగ్‌ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు, బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.