ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : బాల కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దుకాణాల్లో పనిచేస్తున్న పలువురు బాల కార్మికులను సిఐడి, కార్మిక శాఖ అధికారులు అడపాదడపా గుర్తించి పట్టుకుంటున్నారు. వీరిని పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా ఇటీవల కాలంలో పాఠశాల విద్యలో వచ్చిన మార్పులు, నూతన విద్యావిధానం అమలు, పాఠశాల విలీనం పేరుతో కుదింపు తదితర కారణాల వల్ల వేలాది మంది చదువునుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు దూరం కావడం, కొన్ని ఎయిడెడ్ పాఠశాలలు తొలగించడం, పలు ఎయిడెడ్ పాఠశాలలు అన్ ఎయిడెడ్‌గా మారి ఫీజులు వసూలు చేయడం వంటి కారణాలతో విద్యార్థులుగా ఉండాల్సిన బాలలు ఇతర మార్గాలవైపు మళ్లుతున్నారు. పాఠశాలలకు దూరమైన వారిని వెనక్కి తీసుకువచ్చి తిరిగి పాఠశాలలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి.
గుంటూరులోని వేర్వేరు ప్రాంతాల్లో 14 ఏళ్లలోపు పిల్లలు ఇతర పనులకు వెళ్తున్నారు. కొంతమంది బిక్షాటన చేస్తున్నారు. గుంటూరులో గోవుల కేంద్రాలను నిర్వహిస్తున్న కొంత మంది ప్రజల్లోఉన్న సెంటిమెంట్స్‌ను ఆసరాగా తీసుకుని బాల బాలికలకు గోవులు ఇళ్ల వెంబడి పంపించి యాచిస్తున్నారు. కొంతమందికి ఆవుతో ఉన్న సెంటిమెంట్‌ను ఆవులపెంపకం నిర్వహణా కేంద్రాల వారు సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం గుంటూరులోని అనేక ప్రాంతాల్లో ఆవులతో అడుకుంటున్న బాలలు అనేక మంది కన్పిస్తున్నారు. ఆర్‌టిసి బస్సులు, థియేటర్ల వద్ద తినుబండారాలు విక్రయిస్తూ అనేక మంది బాలలు కన్పిస్తున్నారు.
బాలలను పనుల్లో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నా పలువురు యజమానులు పనుల్లో చేర్చుకుంటున్నారు. అయితే ఆధార్ కార్డులో 15 ఏళ్లుకు పైగా ఉన్నట్టు నమోదు చేయించుకురావాలని సూచిస్తున్నారు. ఆధార్ కార్డులో 15 ఏళ్ల దాటి ఉన్నట్టు ఉంటే చేర్చుకుని వీరు బాలకార్మికులు కాదని వ్యాపారులు అధికారులను బురిడి కొట్టిస్తున్నారు. గుంటూరులో వివిధ దుకాణాల్లో పనిచేస్తున్న 9 మంది బాల కార్మికులను ఇటీవల సిఐడి ఎస్‌పి కె.వి.జి.సరిత ఆధ్వర్యంలో గుర్తించి వారిని బాలలసదన్‌కు పంపారు. వీరి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి చదివించాలని సూచించారు. ఆపరేషన్ స్వేచ్ఛ-3లో భాగంగా బచ్పన్ బచావో ఆందోళన క్రాప్ ఆర్గనైజేషన్‌లు కలిసి గుంటూరులో మెకానిక్ షాప్స్, వాటర్ ప్లాంట్స్, చికెన్ సెంటర్‌లో బాల కార్మికుల డ్రైవ్ నిర్వహించి 9 మంది బాల కార్మికులను గుర్తించారు. వారిని రిస్క్యూ జిల్లా బాలకార్మిక విభాగం ఎదుట హాజరుపరిచారు. ఇంకా చాలామంది చదువుకు దూరంగా వేర్వేరు మార్గాల్లో జీవనం సాగిస్తున్నారు.










