
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:మున్సిపాలిటీలోని రెల్లి వీధికి చెందిన 17 సంవత్సరాల మంజేటి హిమ బాల్య వివాహాన్ని బుధవారం ఐసిడిఎస్ సిబ్బంది అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు సిపిడిఓ సువార్త, ఎస్‌ఐ సుధాకర్, సూపర్వైజర్లు బాల్య వివాహం జరగకుండా అడ్డుకున్నారు. బాల్య వివాహంతో జరిగే అనర్థాలను తల్లిదండ్రులకు వివరించి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బాల్య వివాహాలపై ర్యాలీ
ప్రజాశక్తి-గొలుగొండ:బాల్య వివాహాలకు వ్యతిరేకంగా బుధవారం గొలుగొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం వద్ద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిఒ శ్రీగౌరీ మాట్లాడుతూ, ప్రజల సహకారం, మద్దతుతో మాత్రమే ఈ సామాజిక దురాచారాన్ని నిర్మూలించ వచ్చన్నారు. బాల్య వివాహాలను అరికట్టడంలో పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు అందిస్తున్న సహకారం కూడా ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు సత్యవతి, అంగన్వాడీ కార్యకర్తలు, పాల్గొన్నారు.