
ప్రజాశక్తి - పార్వతీపురం : బాల్య వివాహాలు నిరోధించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం జిల్లా స్థాయి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో మంగళవారం జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతున్నా గుర్తించాలి, వాటిని నిరోధించాలన్నారు. బాల్య వివాహాలు సామాజిక దురాచారంగా పరిగణిస్తామని, వాటి పట్ల అవగాహన అవసరమని అన్నారు. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బాల్య వివాహాలు నిరోధానికి అందరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో మహిళా పోలీస్, సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఉందని, గ్రామ స్థాయిలో జరిగే వివాహాల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లా బాలల రక్షణ అధికారి ఎ. సత్యనారాయణ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిపించిన, సహకరించిన, ప్రోత్సహించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మాదక ద్రవ్యాలపై నిఘా ఉంచాలి
మాదక ద్రవ్యాలపై నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా ఉండాలని, అందుకు అన్ని వర్గాల తోడ్పాటును అందించాలన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవేశించకుండా గట్టి నిఘా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. బస్సుల్లో రవాణా చేసే అవకాశం ఉందని, అటువంటి వాటిపై కండక్టర్ లకు తగిన అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్‌పి విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ బస్సులు, రైళ్లలో రవాణా జరుగుతున్నట్లు సమా చారం అందుతుందన్నారు. ప్రయాణికుల బాగ్‌ల్లో అనుమానాస్పదంగా ఉంటే అటువంటి సమాచారం అందించాలని ప్రజా రవాణా అధికారులను సూచించారు. వివిధ ప్రాంతాల్లో విద్యార్థులకు సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయని, కళాశాలల ప్రిన్సిపాల్ లు, విద్యార్థులకు మాదక ద్రవ్యాల అనర్థాలపై తరచూ అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డిఆర్‌ఒ జె.వెంకట రావు, ఎఎస్‌పి ఒ.దిలీప్ కిరణ్, డిఎస్‌పి మురళీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, డిఎఫ్‌ఒ జిఎపి ప్రసూన, డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్ కుమార్, జిల్లా ఎస్‌సి, బిసి కార్పొరేషన్ ఇడిలు ఎం.డి.గయాజుద్దీన్, ఎస్.కష్ణ, డిటిఒ సి.మల్లిఖార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.