Oct 16,2023 22:10

మక్కువ.. చప్పబుచ్చంపేటలో ప్రతిజ్ఞ చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి-గరుగుబిల్లి : గ్రామస్థాయి నుంచి బాల్య వివాహ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపిపి ఉరిటి రామారావు, జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ మరిశర్ల బాపూజీనాయుడు అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోమండల వైఎస్సార్‌ క్రాంతిపదం ఆధ్వర్యంలో బాల్యవివాహ రహితభారతదేశం కార్యక్రమంలోభాగంగా మహిళాసంఘాలు చేపట్టిన ర్యాలీని వీరు ప్రారంభించారు. బస్టాండ్‌ ఆవరణలో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞచేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. స్థానిక సర్పంచ్‌ కలిశెట్టి ఇందుమతి, ఎంపిడిఒ జి. పైడితల్లి, ఇన్చార్జి తహశీల్దార్‌ పెల్లూరి సత్యలక్ష్మి కుమార్‌, ఎంఇఒ నగిరెడ్డి నాగభూషణరావు, ఇఒపిఆర్‌డి ఎల్‌.గోపాలరావు, పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ ప్రియాంక మండలమహిళా సమాఖ్యఅధ్యక్షురాలు గంట లక్ష్మి, ఎపిఎం పెద్దిరెడ్ల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం : బాల్య వివాహాలను అరికట్టాలని కోరుతూ స్థానిక బజార్‌ నుంచి బస్టాండ్‌ వరకు బస్టాండ్‌ నుండి పెద పెద్ద భోగిలి వరకు వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిఎం శ్రీరాములనాయుడు మాట్లాడుతూ 18 ఏళ్ల నిండకుండా పిల్లలకు పెళ్లిళ్లు చేయకూడదని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. సిసిలు కోటేశ్వరరావు ఆనందు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్‌ : బాల్య వివాహాలనే సామాజిక దురాచారాన్ని నిర్మూలించడానికి ప్రతి గ్రామంలోనూ స్వయం సహాయక సంఘాల మహిళలు అవగాహన కల్పించాలని డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌ కుమార్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా మహిళా సమాఖ్య భవనంలో జరిగిన ఒక కార్యక్రమంలో గ్రూపు సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల రక్తహీనతతో బాధపడతారని, పుట్టిన శిశువులు బలహీనంగా తయారవుతారని తెలిపారు. దీనివల్ల మాతా, శిశు మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ఇదే కార్యక్రమాన్ని పెదబొండపల్లి సచివాలయంలో ఎపిడి వై.సత్యంనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎపిఎంలు త్రినాథమ్మ, ఐబి.జయమ్మ, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.
మక్కువ : బాల్య వివాహాలను అరికట్టే దిశగా అందరూ నడుం బిగించాలని ఎపిఎం సన్నిబాబు పిలుపునిచ్చారు మండలంలోని అన్ని పంచాయతీ కేంద్రాల్లో సెర్ఫ్‌ ఆదేశాల మేరకు సోమవారం ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు, మహిళలకు బాల్యవివాహాల వల్ల జరిగే అరిష్టాలను ఈ సందర్భంగా వివరిస్తూ అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు కృషి చేస్తామని అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, వైకెపి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.