
రాయచోటి : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని బాల్యవివాహాలు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికా రులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై ఎస్‌పి కృష్ణా రావుతో కలిసి కలెక్టర్ గిరీష, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఅర్‌ఒ సత్యనారాయణ, ఐసిడిఎస్ పీడీ ధనలక్ష్మి, రాయచోటి, మదనపల్లి, రాజంపేట ఆర్‌డిఒలు రంగ స్వామి, మురళి, రామకష్ణరెడ్డి, ఎన్‌జిఒలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల్య వివా హాలను ప్రోత్సహించే ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు టోల్ ఫ్రీ నెంబర్ 1098కు ఫోన్ చేసి సహకరించాలన్నారు. సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులు, పంచాయతీ సెక్రటరీలు, ఎఎన్‌ఎంలు, బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యం గా ఎన్జీవోలు బాల్య వివాహాలు అధికంగా జరిగే ప్రాంతాలలో ప్రజలకు అవగా హన కల్పించి వివాహం చేసుకోబోయే అమ్మాయిలకు, అబ్బాయిలకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా బాల్య వివాహాలు జరగడం చాలా బాధాకరమన్నారు. బాల్య వివాహాల వల్ల అమ్మాయి, అబ్బాయి జీవితం నాశనం అవుతుందని తల్లిదండ్రులు గుర్తిం చాలన్నారు. చాలా పాఠశాలల్లో కేవలం పెళ్లి కోసమే అమ్మాయిలు డ్రాప్ అవుట్ అవుతుంటారని అమ్మాయిల డ్రాప్ అవుట్ లిస్టుపై ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ఆర్‌డిఒలు, తహశీల్దార్‌లు, ఎంపిడిఒలు, ఐసిడిఎస్, వైద్యాధికారులు, విద్య శాఖ అధికారులు సమన్వయంతో ప్రతి నెల క్రమం తప్పకుండా డివిజన్ స్థాయి, మండలస్థాయి గ్రామస్థాయిలో బాల్య వివా హాల నిర్మూలనకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. బాల్య వివా హాలపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని అన్నమయ్య జిల్లాలో ఒకటి కూడా బాల్య వివాహం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎస్‌పి కృష్ణారావు మాట్లాడుతూ తెలిసి తెలియని చిన్న వయసులో బాలికలు వివాహం చేసుకోవడం జీవితంలో ఎదుగుదలకు ఎన్నో రకాలుగా అవరోధం కలిగిస్తుందన్నారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు 21 సంవత్సరాలలోపు అబ్బాయికి వివాహం చేస్తే పెళ్లి కుమారునికి, వారి తల్లిదండ్రులకు పెళ్లిలో పాల్గొన్న వారికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఇది బెయిలు లభించని నేరమన్నారు. మైనర్ బాలికను వివాహం చేసుకొని తనతో సంసారం చేసిన భర్తకు ఫోక్సో చట్టం కింద 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించవచ్చునన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్‌పి, జెసి చేతుల మీదుగా బాల్యవివాహాల నిరోధక చట్టం-2006, పోస్టర్‌ను ఆవిష్కరించారు.