Sep 20,2023 20:25

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజరురామరాజు

కడప : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ వి.విజరురామరాజు హెచ్చరించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని విసిహాలులో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బాల్య వివాహాల వ్యవస్థ నిర్మూలనపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలు దాటిన తరువాతే వివాహాలు జరిపించాలని, నిబంధనలకు విరుద్ధంగా వివాహాలు చేస్తే రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని, అంతేగాక వారి తల్లి దండ్రులకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాల్యవివాహాలు చేయడం వలన కలిగే నష్టాలు గురించి వారికి అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహల కట్టడి తో మాతా శిశు మరణాలు తగ్గించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని సచివాలయ పరిధిలో మహిళా పోలీస్‌ సహకారంతో రిజిస్టర్‌ మెయింటైన్‌ చేసి తప్పకుండా పెళ్లిళ్ల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. పెళ్లి తంతు జరిపించే పూజారులు, మతపెద్దలు, ఫొటో, వీడియో గ్రాఫర్‌లు, ఫంక్షన్‌ హాల్స్‌, మ్యారేజ్‌ బ్రోకర్స్‌, ప్రింటర్స్‌ ముందుగా వదధూవరుల వయస్సుతో ఆధార్‌ కార్డుతో సరిచూసుకొని పెళ్లిళ్లు జరిపించాలన్నారు. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను జారీ చేసే సమయంలో వారి ఆధార్‌ కార్డుతో వయసును సరి చూసుకుని సర్టిఫికెట్‌ను జారీ చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఒకవేళ బాల్య వివాహాలు జరిపిస్తే పైన పేర్కొన్న వారందరిపై కేసులు నమోదు చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్‌ తన ఇళ్ల పరిధిలో పెళ్లిళ్ల సమాచారంపై అవగాహన కలిగి ఉండాలని, వారి పరిధిలో మైనర్లు పై పెళ్లిళ్లు జరిగితే, వాలంటీర్లపై కూడా కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల్లో గర్ల్‌ చైల్డ్‌ డ్రాప్‌ ఔట్స్‌ పైన ఖచ్చితమైన నిఘా ఉంచి, తిరిగి వాళ్ళని మళ్లీ స్కూల్లల్లో చేర్పించే వరకు బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్స్‌ డ్రాప్‌ ఔట్స్‌లో బాల్యవివాహాలు జరిగితే హెడ్‌ మాస్టర్‌, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. అలాగే ఫంక్షన్‌ హాల్స్‌, ఆలయాలు, చర్చిలు, షాది ఖానాల ముందు బాల్యవివాహాల నిషేధంపై హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. విఒ మీటింగ్‌లలో బాల్య వివాహాల నిరోధంపై డిఆర్‌డిఎ, మెప్మా, పోలీస్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డిఎస్‌ఆర్‌తో పాటు బాల్యవివాహాలపై కచ్చితంగా రిజిస్టర్‌ మెయింటైన్‌ చేయాలని పోలీస్‌ శాఖ వారిని ఆదేశించారు. బాల్య వివాహాలపై సమాచార పౌర సంబంధాల శాఖ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తతంగా ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. ఆపదలో ఉన్న బాలల తక్షణ సహాయం కొరకు 181,1098,100,112 టోల్‌ ఫ్రీ నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చునని తెలిపారు. బాల్య వివాహాలు, బాల్య అక్రమ రవాణా, బాలలపై అక్రమ వేదింపులు, బడి బాట పడదాం, బాల్య వివాహాలకు ముగింపు పలుకుదాం తదితర పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, ఆర్‌డిఒలు ధర్మచంద్రారెడ్డి, వెంకటేశం, శ్రీనివాసులు, ఐసిడిఎస్‌ పీడీ శ్రీలక్ష్మి, డిసిపిఒ సుభాష్‌, మెప్మా పీడీ సురేష్‌రెడ్డి, డిఆర్‌డిఎ పీడీ ఆనంద్‌ నాయక్‌, జడ్పీ సిఇఒ సుధాకర్‌రెడ్డి, ఐ అండ్‌ పీఆర్‌ ఎడి వేణుగోపాల్‌రెడ్డి, పోలీస్‌ అధికారులు, దేవాదాయ శాఖ ఎసి శంకర్‌ బాలాజీ, మున్సిపల్‌ కమిషనర్లు, సఖి సెంటర్‌ అధికారులు పాల్గొన్నారు.