లక్కిరెడ్డిపల్లి : చదువుకునే వయసులో బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరమని లక్కిరెడ్డిపల్లి సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ఫయాజ్ ఉన్నిసా పేర్కొన్నారు. శనివారం లక్కిరెడ్డిపల్లి జడ్‌పి బాలికల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలు పాఠశాలకు వెళ్లి బాగా చదువుకొని మంచి విజ్ఞానవంతులు కావాలని, చాలామంది పేదవారు ఆడపిల్లకు చదువు ఎందుకని చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేస్తున్నారని అన్నారు. బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులు కూడా శిక్షార్హులవుతారని అన్నారు. పాఠశాలకు వెళ్లేటప్పుడు ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. పొక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలికలు చదువుకోడానికి ప్రభుత్వ వసతి గహాలు ఎన్నో ఉన్నాయని వాటిలో చదువుకొని మంచి విద్యావంతులు కావాలని తెలిపారు. సిఐ వరప్రసాద్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు సైబర్ నేరగాళ్లు ఫోన్లో ద్వారా ఏడిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. పేద పిల్లలు చదువుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వసతులు ఏర్పాటు చేసిందని ప్రతి తండ్రి తన బిడ్డలను బాగా చదివించుకొని మంచి భవిష్యత్తును అందించాలన్నారు. కార్యక్రమంలో సిఐ మల్లికార్జునరెడ్డి, హెచ్ ఎంఒ జగన్మోహినిదేవి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










