ప్రజాశక్తి-భట్టిప్రోలు: బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని భట్టిప్రోలు గ్రామ సర్పంచ్ దారా రవికిరణ్మయి పేర్కొన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాలలో కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందికి కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చిన్నారులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం క్రమం తప్పకుండా ఇవ్వాలని అన్నారు. బరువు తక్కువ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
ఇంకొల్లు రూరల్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని పావులూరు సెక్టార్ సూపర్‌వైజర్ ఆర్ వాణి పేర్కొన్నారు. ఇంకొల్లు మండలంలోని పావులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేయటం వల్ల జరిగే నష్టాలను గురించి వివరించారు. కిశోర బాలికలకు తీసుకోవాల్సిన పౌష్టికాహారాన్ని గురించి విపులంగా వివరించారు. రక్తహీనత లేకుండా చూసుకోవాలని వాణి సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని సిహెచ్ గిరిజారాణి, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.










