Sep 23,2023 21:06

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

 రాయచోటి : జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆర్‌డిఒలు, సిడిపిఒలు, మండల స్థాయి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ సెక్ర టరీలు, గ్రామ వార్డు స్థాయి అధికారులతో బాల్యవివాహాల నిర్మూలనపైనా, ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 31, 39ల అమలుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని బాల్యవివాహాలు జరిగితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. జిల్లాలో బాల్యవివాహాలు జరిగే హాట్‌ స్పాట్‌ ప్రాంతాలను గుర్తించాలని, గోడల మీద ప్రజలకు అర్థమయ్యే విధంగా పెయింటింగులను ఏర్పాటు చేసి బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలని సూచిం చారు. వివాహ కార్యక్రమాలను నిర్వహించే పురోహితులకు, పాస్టర్లకు, ముల్లాలకు, కల్యాణ మండప నిర్వాహకులకు, తదితరులకు బాల్య వివాహాలు జరగకుండా ఉండేందుకు అవగాహన కల్పించాలని సూచిం చారు. డివిజనల్‌, మండల స్థాయి అధికారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి బాల్యవివాహాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశిం చారు. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలు, అబ్బా యిలను పాఠశాల లేదా కళాశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసు కోవాలని మండల స్థాయిలో ఎంఇఒలకు, సిఆర్‌పిలకు సచివాలయ స్థాయిలో ఎడ్యుకేషన్‌ సెక్రటరీలకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల లేదా కళాశాల బయట కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, ఎన్‌జిఒల సాయంతో వారికి ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్య అభివద్ధి శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలని కోరారు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వెల్ఫేర్‌ హాస్టళ్లు, తదితర వాటిలలో బాల్య వివాహాలు, బాలలకు ఉన్న హక్కులు, వారి సాయం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌ నెంబర్లపై తెలియజేయాలన్నారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు ,21 సంవత్సరాలు లోపు అబ్బాయిలకు వివాహం చేస్తే పెళ్లి కుమారునికి వారి తల్లిదండ్రులకు పెళ్ళిలో పాల్గొన్నవారికి జైలు శిక్ష, జరిమానా విధిస్తామనే ఈ విషయాన్ని విస్తతంగా ప్రచారం చేయాలని సంబంధితఅధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఐసిడిఎస్‌ జిల్లా అధికారి ధనలక్ష్మి, ఆర్డీవోలు, సిడిపిఒలు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.