
రాయచోటి : బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని, విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి స్త్రీ, శిశుసంక్షేమ, బాల్య వివాహాల నిరోధక చర్యలు, పాఠశాల విద్య, హౌసింగ్, స్పందన గ్రీవెన్స్, గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో సమీక్ష నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ విసి హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ గిరీష పిఎస్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, తదితర జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన వందశాతం విద్యార్థులు గ్రాస్ ఎన్రోల్మెంట్ జరగాలన్నారు. పాఠశాలలో చేరని వారిని గుర్తించి తిరిగి వారిని పాఠశాలలో చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పదవ తరగతి ఫెయిల్ అయిన వారందరినీ తిరిగి పదిలో చేర్పించి ఎన్రోల్ చేయాలన్నారు. అలా చేయడం వల్ల వారికి అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజన పథకం తదితరాలు వర్తిస్తాయన్నారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని బాల్యవివాహాలు జరిగితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సూచించారు. బాల్యవివాహాలు జరిగే హాట్ స్పాట్ ప్రాంతాలను గుర్తించి గోడల మీద ప్రజలకు అర్థమయ్యే విధంగా పెయింటింగ్‌తో బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి రాయించాలన్నారు. వివాహ కార్యక్రమాలను నిర్వహించే పురోహితులకు, పాస్టర్లకు, కళ్యాణ మండప నిర్వాహకులకు, బాల్యవివాహాలు జరగకుండా ఉండేందుకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి అయ్యేటట్లు చూడాలన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గుర్తించిన ప్రాధాన్యతా పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కషి చేయాలన్నారు. రక్తహీనత లోపం ఉన్న గర్భిణులు ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దష్టి పెట్టి వారికి సరైన పోషకాహారం అందేటట్లు చూసి రక్తహీనత నివారణకు కషి చేయాలన్నారు. కలెక్టర్ గిరీష మాట్లాడుతూ 5 నుండి 18 సంవత్సరాల్లోపు బడి బయట ఉన్న పిల్లలందరూ గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ సర్వేలో కచ్చితంగా నమోదై పాఠశాలల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు అనీమియా బారిన పడకుండా ఉండేందుకు, క్రమం తప్పకుండా పౌష్టికాహారం ఇవ్వాలని. చిన్నపిల్లలలో బరువు తక్కువ ఉండడం, ఎదుగుదలలోపం వంటి సమస్యలకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని మండల స్థాయి స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి ధనలక్ష్మి, హౌసింగ్ పిడి శివయ్య, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.