Oct 18,2023 23:42

ప్రజాశక్తి-కాకినాడ బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కలిగించేలా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. బాల్య వివాహాల వల్ల బాలిక, ఆమె పిల్లల జీవితం, భవిష్యత్తుపై తీవ్రమైన పరిమాణాలను కలిగిస్తుందన్నారు. బాల్య వివాహాలు నివారించేందుకు గ్రామస్థాయి నుండి కలిసికట్టుగా పని చేయాలన్నారు. బాల్య వివాహం చేయడానికి సన్నద్ధం అవుతున్నారని తెలిస్తే ముందుగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, బాల్య వివాహం వలన పిల్లలపై ఎటువంటి దుష్పరిణామాలు ఏర్పడ తాయో విశదీకరించాలన్నారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, ఇందుకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారని హెచ్చరించాలన్నారు. బాల్య వివాహంపై సమాచారాన్ని 112 లేదా చైల్డ్‌లైన్‌ 1098 నెంబరుకు తెలియజేయాలన్నారు. ఎక్కడా ఒక్క బాల్య వివాహం కేసు కూడా నమోదు అవ్వకూడదన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమన్నారు. అనుమానం ఉన్న చోట ముందుగానే అప్రమత్తం చేసి బాల్య వివాహలు జరగకుండా మన వంతు భాధ్యతగా కషి చేద్దామన్నారు. జిల్లాలో హాట్‌ స్పాట్‌లను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నెలా విధిగా గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ బాల్య వివాహాలను గుర్తిస్తే 1098కు ఫోన్‌ చేసి తెలియజేయాలని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఐడిసిడిఎస్‌ పీడీ కె.ప్రవీణ, డిసిపిఒ సిహెచ్‌.వెంకటరావు, ఆర్‌డిఒ ఎన్‌వివి. సత్యనారాయణ, డిపిఒ ఆర్‌.విక్టర్‌, డిఇ ఒ నాగమణి, జెడి రమణమూర్తి, ఎ.విజయ శాంతి పాల్గొన్నారు.