Oct 06,2023 20:04

ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-విజయనగరం : బాల్య వివాహాలను అరికట్టడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో, సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. బాల్య వివాహాల నిరోధంపై జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్‌ సూచించారు. బాల్య వివాహాల నిషేద చట్టం-2006 గురించి ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతకుమారి, డిసిపిఒ ఎ.సత్యనారాయణ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ చేశారు. బాల్య వివాహాల నిరోదానికి జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. అనంతరం కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, బాల్య వివాహాల నివారణా బాధ్యత కేవలం స్త్రీ శిశు సంక్షేమ శాఖపైనే కాకుండా, ఇతర శాఖలపైనా ఉందన్నారు. మండల స్థాయి బాల్య వివాహ నిషేధ అధికారులు (సిఎంపిఒ)లు మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని కోరారు. ఇప్పటికే వివిధ శాఖల వద్ద పది, ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థినుల జాబితా ఉందని, అలాగే బడి బయట ఉన్న పిల్లల జాబితా కూడా ఉందని, అటువంటివారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విస్తత ప్రచారం ద్వారా బాల బాలికలకు, తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. తమ పిల్లలకు బాల్య వివాహం చేయబోమన్న హామీ పత్రాన్ని పొదుపు సంఘాల మహిళలనుంచి తీసుకోవాలని డిఆర్‌డిఎ, మెప్మా శాఖలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉండే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలు, ఎఎన్‌ఎంలతోపాటు, సచివాలయ కార్యదర్శులంతా బాల్య వివాహాలను అరికట్టడంపై దృష్టి సారించాలని చెప్పారు. బాల్య వివాహాలను చేయడమే కాకుండా, దానిలో పాల్గొనడం కూడా నేరమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. వివాహం చేసే తల్లితండ్రులు, పురోహితులు, ఫొటో గ్రాఫర్లు, కల్యాణ మండపం నిర్వాహకులు తదితర అన్ని రకాల భాగస్వాములపై కేసు పెట్టడంతోపాటు, వివాహంలో పాల్గొన్న బంధువులపైనా బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ సూచించారు. వివాహం జరిపే ముందు వారి వయసు ధవీకరణ పత్రాన్ని తీసుకోవాలన్నారు. ప్రతీ వివాహాన్ని తప్పనిసరిగా రిజిష్టర్‌ చేయాలని, రిజిష్టర్‌ అయిన పెళ్లిళ్ల వివరాలను వారం వారం తమకు అందజేయాలని రిజిష్ట్రేషన్‌ శాఖను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ఆర్‌డిఒలు, పోలీసు అధికారులు, ఐసిడిఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు.