ప్రజాశక్తి - వేటపాలెం
బాల్య వివాహాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బి పద్మావతి కోరారు. స్థానిక ఐసిడిఎస్ సమావేశ హాలులో జిల్లా ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం 18ఏళ్లలోపే బాలికలకు వివాహాలు చేస్తున్నారని అన్నారు. చిన్న వయసులో పెళ్లి చేసుకుని తల్లులుగా మారుతున్నందువల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు. మాతృ మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు. అందువల్ల బాల్య వివాహాలు అరికట్టడంలో కృషి చేసేవారికి తమ కమిషన్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. వెబ్ పోర్టల్ ద్వారా తమకు ఫిర్యదు చేయవచ్చని తెలిపారు. మంచి స్పర్శ, చెడుస్పర్శ అనుచిత ప్రవర్తనపై బాలికలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. పాఠశాలలో స్థాయిలో నైతికత, మానవతా విలువలు నేర్పించాలని అన్నారు. బాల్యవివాహాపై నమోదైన కేసులు, వాటిపరిష్కారం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన ఘటనల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో బాల్య వివాహాలు సగటు 29.3శాతం ఉండగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 18ఏళ్లలోపు 37.3 శాతం, ఉమ్మడి ప్రకాశం బాపట్ల జిల్లాలో 36 .3శాతం వివాహాలు జరగాయని తెలిపారు. 13.6శాతం గర్భం దాల్చినట్టు అధికారిక నివేదికల్లో చూపడం విచారకరమని అన్నారు. 2022-23వ సంవత్సరంలో రాష్ట్రంలో 8,13,901మంది గర్భం దాల్చారని వారిలో 18ఏళ్లలోపు 51,414మంది (6.32 శాతం) ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించిందని అన్నారు. పోలీసు, ఐసిడిఎస్, గ్రామస్థాయి అధికారులు సమన్వయంతో బాల్యవివాహాలు నిరోధించాలని అన్నారు.
కమిషన్ ఆగ్రహం
సమావేశానికి ఆలస్యంగా వచ్చిన అధికారులు, గైరహాజరైన వీఆర్వోలు, తాసిల్దార్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ద్వారా మెమో ఇవ్వాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. బాలలంటే ఎవరనే ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఒక మహిళా పోలీసు మాత్రమే సరైన సమాధానం చెప్పడంతో ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ, జిల్లా ఇన్చార్జి పిడి కె ఉమా, ఎంపీడీవో కె నేతాజీ, ఎంఈఓ సుబ్బయ్య, ఎంఈఓ-2 పురుషోత్తం, డిసిపిఓ దినేష్, జిల్లా ఇమినైజేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డాక్టర్లు ఎస్‌హెచ్ సాంసన్, ఏఎల్ఓ రామకృష్ణ, డిసిపియు ఎస్‌డబ్ల్యు పురుషోత్తం, సాడ్ ఎన్జీవో లక్ష్మి పాల్గొన్నారు.










