May 16,2023 17:58

సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఆదోని
డివిజన్‌లో బాల్య వివాహాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో బాల్య వివాహాల సంపూర్ణ నివారణపై డివిజన్‌లోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదరికం, నిరక్షరాస్యత, వలసలు, మూఢ నమ్మకాలు, ఆడపిల్లల భద్రత తదితర కారణాల వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిపారు. బాల్య వివాహాల నివారణకు రాష్ట్రంలోని మహిళా కలెక్టర్లు, మహిళా ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఆడ పిల్లలకు చిన్నవయస్సులో వివాహాలు చేయడం వల్ల మాతృ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఆడ పిల్లల భవిష్యత్తు బాగుండేలా సమాజంలో మార్పునకు అధికారులతోపాటు ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. బాల్య వివాహాలపై 1902 నెంబర్‌కు కాల్‌ చేసి అధికారులకు సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల కలిగే అనర్థాలను వాలంటీర్లు, ఎఎన్‌ఎంలు గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. గర్భిణులు, కౌమార దశలో ఉన్న బాలికల్లో రక్త హీనత నివారణకు ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను అందిస్తోందన్నారు. వాటిని వేసుకునేలా అంగన్వాడీ సిబ్బంది, ఎఎన్‌ఎంలు దృష్టి పెట్టాలన్నారు. బడి ఈడు పిల్లలు బడిలో ఉండేలా, బడి మానేయకుండా సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, తహశీల్దార్‌ వెంకటలక్ష్మి, సిడిపిఒ ఉమామహేశ్వర, ఎంపిడిఒ గీతావాణి పాల్గొన్నారు.