ప్రజాశక్తి - బెల్లంకొండ : బాల్య వివాహాలు నిర్మూలించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి, ఎంపిపి చెన్నపరెడ్డి పద్మా వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బాల్య వివాహాల నిషేధ చట్టం-2006, జిఒ ఎంఎస్ 31పై మండల కేంద్రమైన బెల్లంకొండలోని ఎంపిడిఒ కార్యాలయంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి గురువారం అవగాహన, సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి సిడిపిఒ స్వర్ణ కుమారి అధ్యక్షత వహించగా ఎంపిపి మాట్లాడుతూ బాలల విద్య కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని, వారిని చదివించి బంగారు భవితను ఇవ్వాలని కోరారు. బాల్య వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అమ్మాయి వయసు 18 సంవత్సరాలు అబ్బాయి వయసు 21 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే పెళ్లిళ్లు చేయాలని సూచించారు. బత్తుల పద్మావతి మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయించిన వారికి, హాజరైన వారికి రెండేళ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనలో గ్రామస్థాయిలో బాల్య వివాహాల నిరోధక కమిటీలకు చైర్మన్‌గా ఉన్న సర్పంచ్ ప్రధాన పాత్ర పోషించాలని చెప్పారు. 14 ఏళ్లలోపు బాలికను పెళ్లి చేసుకున్న మేజర్ వరుడికి 20 ఏళ్లపాటు, 16-18 సంవత్సరాలు లోపు అమ్మాయిని పెళ్లి చేసుకున్న వరుడికి పదేళ్ల వరకూ కఠినగార శిక్ష ఉంటుందని వివరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో నిలిపేసిన బాల్య వివాహాలు, బడిలో చేర్చిన బాలల వివరాలపై అడిగారు. 9 మంది సభ్యులతో కూడిన బాల్యవివాహాల నిషేధ కమిటీ ప్రతినెలా సమావేశమవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి జి.వెంకటరెడ్డి, ఎంపిడిఒ వెంకట్‌రెడ్డి, ఎంఇఒ బాలసుందరరావు, వైద్యాధికారి డాక్టర్ కోటేశ్వరరావు, ఎస్సై అమీర్, అంగన్వాడి సూపర్వైజర్ పరిమళ, వనజ పాల్గొన్నారు.










