
జిల్లా పంచాయతీ శాఖ అధికారి మల్లికార్జునరావు
ప్రజాశక్తి - భీమవరం
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా పంచాయతీ శాఖ అధికారి జివికె.మల్లిఖార్జునరావు కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో బాల్య వివాహ రహిత భారతదేశం, బాలల భద్రతే భారత్ భద్రత నినాదంతో జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. తొలుత జిల్లా పంచాయతీ అధికారి బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు నివారించేందుకు గ్రామస్థాయి నుంచి కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌డిఒ కెసిహెచ్.అప్పారావు, డిఎస్‌పి బి.శ్రీనాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ అప్పిలేటు ట్రిబ్యునల్ మెంబరు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
ఆచంట : బాల్య వివాహాలను రూపు మాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసిందని, అందుకు అనుగుణంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆచంట మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్ పిలుపునిచ్చారు. మండలంలోని కొడమంచిలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం బాల్య వివాహల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి గోవర్ధన్, ఎంఎల్‌హెచ్‌పిలు రూప, రాశి, ఎఎన్‌ఎంలు డి.పుష్పరాజ్యం, వెంకటరమణ పాల్గొన్నారు.
గణపవరం :బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాశిపాడు మహిళ సంరక్షరాలు భానుప్రియ అన్నారు. మండలంలోని కాశిపాడులో సోమవారం బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి కోట నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆర్‌డి.రామారావు, ఆరోగ్య సహాయకులు నామాల రాజు, వైసిపి నాయకులు సిల్వర్ స్టార్ రాజు, ఆశాలు కృష్ణకుమారి, వరలక్ష్మి పాల్గొన్నారు.
ఆకివీడు :బాల్య వివాహాలను నిషేధించ డం ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని తహశీల్దార్ విజయలక్ష్మి, ఎంపిడిఒ శ్రీవాణి అన్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద స్పందన కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ శాఖల మండల అధికారులు, పట్టణ అధికారులతో ఐసిడిఎస్ అధికారి నిర్మల ప్రతిజ్ఞ చేయించారు.
కాళ్ల : బాల్య వివాహాలు చేసి వారి జీవితాలను నాశనం చేయవద్దని, బాలికల రక్షణ, సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులదేనని అంగన్‌వాడీ టీచర్ శ్రీదేవి అన్నారు. పెదఅమిరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాలికలకు పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.