Oct 16,2023 23:19

క్యాండిల్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌, పాల్గొన్న అధికారులు, సిబ్బంది

ప్రజాశక్తి-గుంటూరు : బాల్య వివాహాల నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. బాల్య వివాహాల నిర్మూలన, అవగాహనపై స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుండి మూడుబొమ్మల సెంటర్‌ వరకూ సోమవారం రాత్రి కొవ్వొతులతో ర్యాలీ చేశారు. ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌.. బాల్య వివాహాల నిర్మూలనపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతనెలలో జీవో 39ను విడుదల చేసిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీల్లో కాకుండా బడిబయట వున్న పిల్లల తల్లితండ్రులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఇందుకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పటిష్టమైన వ్యవస్థ వుందన్నారు. సచివాలయాల్లో వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, ఎన్‌జివోలు వంటి పటిష్టవంతమైన మానవ వనరులు ఉన్నాయని, వారందర్నీ భాగస్వామ్యులను చేసుకుంటూ బాల్య వివాహాల నిర్మూలన పటిష్టంగా చేపడుతున్నామని వివరించారు. గత నెలలో ఆరు బాల్య వివాహాలు, అంతకు ముందు నెలలో నాలుగు బాల్య వివాహాలను నిరోధించినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండని స్త్రీలకు, 21 ఏళ్లు నిండని పురుషులకు వివాహం జరిగితే శారీరక, మానసిక సమస్యలు ఏర్పడతాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీనివాసరావు, ఐసీడీఎస్‌ పీడీ ఉమాదేవి, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ప్రమీలా, సభ్యులు రాజకుమారి, దుర్గాభవాని, చైల్డ్‌ రైట్స్‌ అడ్వకసి ఫౌండేషన్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ సమీర్‌ కుమార్‌ పాల్గొన్నారు.