ప్రజాశక్తి - నందవరం
బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎంపిపి లక్ష్మీదేవమ్మ తెలిపారు. సోమవారం ముగతి గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనపై ర్యాలీ, సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 18 ఏళ్లు నిండకుండా ఆడపిల్లలకు వివాహం చేయరాదని, వివాహం చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. గర్భిణీ అయిన తర్వాత ప్రసవ సమయంలో బిడ్డతో పాటు తల్లి కూడా ప్రాణాపాయం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లిళ్లు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు. విబికె దస్తగిరి, మహిళలు పాల్గొన్నారు. హాలహర్విలో ఎపిఎం శివయ్య అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. పొదుపు మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. మండల సమైక్య అధ్యక్షులు వెంకటలక్ష్మి, సిసిలు గోవిందప్ప, వెంకటరత్నం, అకౌంటెంట్ నరసింహులు పాల్గొన్నారు. గోనెగండ్లలో వైఎస్‌ఆర్ క్రాంతి పథం (వెలుగు) గోనెగండ్ల మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలతో బాల్యవివాహాల నియంత్రణ, బాలికల స్వావలంబన కోసం ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ఇన్‌ఛార్జీ ఎపిఎం ముక్కన్న, సిసిలు లలితా రాణి, శకుంతల, వీర కృష్ణుడు, వెంగన్న, అకౌంటెంట్, రంగశ్రీ పాల్గొన్నారు. మంత్రాలయంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం నుంచి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. వైకెపి ఎపిఎం జయశ్రీ, తహశీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడారు. ఎంపిడిఒ మణిమంజరి, హౌసింగ్ డిఇ లాల్ కృష్ణయ్య, అంగన్వాడీ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి, మహిళలు ప్రమాణం చేశారు.










