Nov 01,2023 21:13

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

 రాయచోటి : బాల్య వివాహాలు పూర్తిగా నివారించి జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి పట్టణంలోని నారాయణ కల్యాణ మండపంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణపై తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎంఇఒలు, సిడిపిఒలు, అంగన్వాడీ సూపర్‌వైజర్లు, డ్వాక్రా మహిళలకు ఒకరోజు వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా బాల్య వివాహాలు జరగడం చాలా బాధాకరమన్నారు. బాల్య వివాహాల వల్ల అమ్మాయి, అబ్బాయి జీవితం నాశనం అవుతుందని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులు, పంచాయతీ కార్యదర్శులు, ఎఎన్‌ఎంలు, బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఎన్‌జిఒలు బాల్య వివాహాలు అధికంగా జరిగే ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించి వివాహం చేసుకోబోయే అమ్మాయిలకు, అబ్బాయిలకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. చాలా పాఠశాలల్లో కేవలం పెళ్లి కోసమే అమ్మాయిలు డ్రాప్‌ అవుట్‌ అవుతుంటారని అమ్మాయిల డ్రాప్‌ అవుట్‌ లిస్టుపై ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ఆర్‌డిఒలు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఐసిడిఎస్‌, వైద్యాధికారులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో ప్రతి నెలా క్రమం తప్పకుండా డివిజన్‌, మండల, గ్రామస్థాయిలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహాలు నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. తెలిసి తెలియని చిన్న వయసులో బాలికలు వివాహం చేసుకోవడం జీవితంలో ఎదుగుదలకు ఎన్నో రకాలుగా అవరోధం కలిగిస్తుందన్నారు.మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్‌బాష మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎస్‌పి కష్ణారావు మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగినట్లయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1098 కు ఫోన్‌ చేసి సహకరించాలన్నారు.ఎపి పోలీస్‌ హెల్ప్‌ లైన్‌100 ఉమెన్‌ హెల్ప్‌ లైన్‌ : 181 సాధారణ హెల్ప్‌ లైన్‌ : 112 కు ఫోన్‌ చేయాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు బేటి బచావో బేటి పడావో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, రాయచోటి, మదనపల్లె, రాజంపేట, ఆర్డీవోలు రంగస్వామి, మురళి, రామకష్ణారెడ్డి, ఐసిడిఎస్‌ పీడీ ధనలక్ష్మి పాల్గొన్నారు.