Oct 03,2023 22:07

బిడ్డను తల్లివద్దకు చేర్చిన పోలీసులు

బాలుని కిడ్నాప్‌ ఉత్కంఠ
గంటల్లోనే కథ సుఖాంతం : ఎస్‌పి
ప్రజాశక్తి - తిరుపతి సిటి, ఏర్పేడు
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో తెల్లవారుజామున అపహరణకు గురైన బాలుడిని ఎట్టకేలకు పోలీసులు పది గంటల్లోపే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతం అయింది. జల్లా ఎస్పీ వివరాల మేరకు... మంగళవారం తెల్లవారు జామున సుమారు 2 గంటల ప్రాంతంలో తిరుపతి ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండులో చెన్నై బస్‌ ప్లాట్‌ ఫామ్‌ రిజర్వేషన్‌ టికెట్‌ కౌంటర్‌ దగ్గర పురసువాకం, చెన్నై కి చెందిన అరుల్‌ మురుగన్‌ (2 సం.లు) అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు మీనా, చంద్ర శేఖర్‌, అన్న మోఘన వసంత్‌ (8)తో పాటుగా నిద్రించారు. అయితే లేచి చూసేసరికి ఆ బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డిఎస్పి ఎ.సురేంద్ర రెడ్డి, రాత్రి డ్యూటి లో ఉన్న తిరుపతి సీసీస్‌ డిఎస్పి రవి కుమార్‌, ఈస్టు సిఐ మహేశ్వర రెడ్డి తమ సిబ్బందితో ప్రత్యేక బందాలుగా ఏర్పాటు చేసి, నలువైపులకు పంపి, గాలింపు చర్యలు చేపట్టారు. కేసును చేధించి తప్పిపోయిన పిల్లవాన్ని అవిలాల సుధాకర్‌ అను అతను అపహరించుకొని పోయినట్లు, తెలుసుకొని అతనిని అదుపులోకి తీసుకొని పిల్లవాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీటీవీ ఫూటేజ్‌ ద్వారా తప్పిపోయిన బాలుడిని ముద్దాయి అవిలాల సుధాకర్‌ అపహరించినాడని గుర్తించి, పోలీసు సోషల్‌ మీడియా విరివిగా బాలుడి ఫోటో తో ప్రచారం కల్పించి, బాలుడు, ముద్దాయిల కోసం తీవ్రంగా గాలించారు. విషయం తెలుసుకున్న ముద్దాయి అవిలాల సుధాకర్‌ అపహరించిన బాలున్ని ఏర్పేడు మండలం మాధవమాల గ్రామం లోని తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకొని వెళ్లి బాలున్ని వదిలిపెట్టి పరారయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసు బందం ఆమె వద్దకు వెళ్లి బాలున్ని క్షేమంగా స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి ఆవిలాల సుధాకర్‌ ను ఈస్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని, సమగ్రమైన విచారణ చేపట్టారు. ముద్దాయి అక్క ధనమ్మ ను, కొంత మంది అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసును అతి వేగంగా ఛేదించి బాలుని ఆచూకీ కనిపెట్టడానికి కషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పి అభినంధించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి పరిపాలన వెంకట్రావు, ఎస్బి డిఎస్పి గిరిధర, తిరుపతి డిఎస్పి సురేంద్ర రెడ్డి, ఈస్ట్‌ సీఐ మహేశ్వర రెడ్డి, కేసును చేదించిన సిబ్బంది పాల్గొన్నారు.
మాధవమాలలో ఆచూకీ లభ్యం
ఏర్పేడులో..తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్‌లో కిడ్నాప్‌ అయిన బాలుని అవిలాల సుధాకర్‌ ఆటోలో తీసుకెళ్లి ఏర్పేడు మండలం మాధవమాల గ్రామంలో సుధాకర్‌ అక్క ధనమ్మకు 3.30 గంటలకు అప్పగించాడు. ఉదయం టీవీలలో, ప్రసారమాధ్యమాలలో కిడ్నాప్‌ అయినట్లు సమాచారం ఉండడంతో మాధవమాల సర్పంచి కరీముల్లాకు తెలపగా, ఏర్పేడు సిఐ శ్రీహరి సిబ్బందితో ధనమ్మను, పిల్లవాన్ని సురక్షితంగా స్టేషన్‌కు తరలించారు. బిడ్డలు లేకపోవడం వల్ల కిడ్నాప్‌ చేసినటుల తెలుస్తోంది.
బిడ్డను తల్లివద్దకు చేర్చిన పోలీసులు