ప్రజాశక్తి-బల్లికురవ రూరల్: అప్పటివరకు తోటి విద్యార్థులతో స్కూల్లో ఆడుతూ పాడుతూ గడిపి ఇంటికి వెళుతున్న తరుణంలో ఆటో రూపంలో చిన్నారిని మృత్యువు కబళించిన ఘటన మండలంలో జరిగింది. ఆటో కిందపడి బాలుడు(9) మృతి చెందడంతో బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ సంఘటన మంగళవారం కొణిదెన గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ వేమన తెలిపిన వివరాల మేరకు.. కొణిదెన ఎస్‌సి కాలనీకి చెందిన బండి జగన్నాథం, భవాని దంపతులకు ఐదుగురు సంతానం. సుకన్య, సుజిని, సుప్రజ, భార్గవి నలుగురు కుమార్తెలు కాగా ఒక కొడుకు బండి సుప్రీం సంతానం. తొమ్మిది సంవత్సరాల ఈ బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. బాలుడు సుప్రీం రోజు లాగా స్కూలుకి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చే మార్గంలో అటువైపు నుంచి ఐరన్ షీట్లు వేసుకుని వస్తున్న మూడు చక్రాల అప్పి ఆటో ఎక్కి వస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాద వశాత్తూ ఆటోలో నుంచి జారి కింద పడిపోవడంతో బాలుడి తల మీదగా ఆటో ఎక్కింది. ఈ ప్రమాదంలో బండి సుప్రీం అక్కడకక్కడే మృతి చెందాడు. బండి జగన్నాథం, భవానికి నలుగురు కుమార్తెల తర్వాత పుట్టిన ఏకైక మగ పిల్లవాడని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉన్నారు. ఉదయం స్కూలుకు వెళ్లి సాయంత్రం ఇలా విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.










