
ప్రజాశక్తి- అనకాపల్లి
మండలంలోని తుమ్మపాల గ్రామంలోని వికలాంగ బాలుడికి అయ్యే వైద్య ఖర్చులను ఎంతైనా ప్రభుత్వం భరిస్తుందని రాష్ట్ర పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. శనివారం ఆయన గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ఒక టిఫిన్ కొట్టు వద్ద ఆయన ఆగి, దాని నిర్వాహకులను పలకరించారు. ఎనిమిది సంవత్సరాలుగా వికలాంగు బాలుడు చేతన్ ప్రవీణ్ పరిస్థితిని తెలుసుకున్నారు. రెండు సంవత్సరాల నుంచి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయని, కూర్చున్న చోట నుంచి లేవలేడని, వైద్యం చేయించడానికి విశాఖ, హైదరాబాదులో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే వివిధ పరీక్షల నిర్వహించి ఈ వ్యాధికి చికిత్స లేదని డాక్టర్లు చేతులెత్తేశారని చేతన్ తండ్రి రాము తెలిపారు. శరీరంలోని మల్లీపుల్ జీన్స్ దెబ్బతిన్నాయని, కొద్ది నెలల కిందట చేతన్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చూపించగా, ఆర్ జీన్స్ దెబ్బతిన్నాయని, ఒక్కో జీన్ నయం చేయడానికి రూ.25 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని రాము వివరించారు. బాలుని పరిస్థితిని చూసి మంత్రి అమర్నాథ్ వెంటనే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించి ముందుగా ఒక జీన్ నయం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో వివరాలు తీసుకు రమ్మని కోరారు. దీనికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తదుపరి వైద్యానికి కూడా ఆర్థిక సహాయం అందేలా చేస్తానని, అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్లి చేతన్ వ్యాధి నయం చేయించడానికి చర్యలు తీసుకుంటామని అమర్నాథ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొర్లె సూరిబాబు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.