ప్రజాశక్తి-కొమరాడ : మండలంలో మూడు రోజుల క్రితం తప్పిపోయిన బాలుడి మృతదేహం నాగావళి నదిలో లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొమరాడ మండలంలోని కొట్టు గ్రామానికి కొల్లి అప్పలస్వామి కుమారుడు కార్తీక్ (8) మూడు రోజుల క్రితం ఇంటి నుంచి తప్పిపోయాడు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కొమరాడ పోలీసులకు తండ్రి అప్పలస్వామి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో బుధవారం ఉదయం పేట గ్రామ సమీపంలో ఉన్న నాగావళి నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పలస్వామి కుమారుడి మృతదేహంగా గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.










