Nov 08,2023 00:48

ప్రజాశక్తి - చీరాల
బాలలు అందరూ తమ హక్కుల గురించి తెలుసుకొని స్వేచ్ఛగా జీవించాలని ఎపి బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ జె రాజేంద్రప్రసాద్ అన్నారు. పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు, కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఉపాధ్యాయులు, బాలికలతో సమావేశం ఏర్పాటు చేశారు. బాలలు స్వేచ్ఛగా జీవించాలని అన్నారు. బాలల హక్కులు భంగం వాటిల్లితే నేరుగా కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువు ద్వారా మాత్రమే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు, గురువులకు మర్యాదనిస్తూ వారి సూచనల ప్రకారం సక్రమమైన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలోని అరిటాకులపేట, ప్రకాష్ నగర్ నందు ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ప్రభుత్వం ద్వారా చిన్నారులకు, గర్భవతులకు అందిస్తున్న పోషకాహారాన్ని సక్రమంగా అందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మ ఒడి, నాడు నేడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్య దీవెన, జగనన్న గోరుముద్ద, కళ్యాణమస్తు, సంపూర్ణ పోషణ అభియాన్, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ వంటి సంక్షేమ కార్యక్రమాలను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంఇఒ సుబ్రహ్మణ్యేశ్వరరావు, సుధారాణి, ఎఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరి, హెచ్ఎం కృష్ణమోహన్, అంగన్వాడీ సూపర్ వైజర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.