Feb 08,2023 23:27

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి

ప్రజాశక్తి-అనకాపల్లి
బాలలపై మత్తు పదార్థాల నీడ పడరాదని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీస్‌, ఎక్సైజ్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఇన్‌కమ్‌ టాక్స్‌ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు మత్తు పదార్థాలు అమ్మకుండా బోర్డులు పెట్టాలని, మత్తు పదార్థాలు వచ్చే అనర్ధాలపై పాఠశాలలు కళాశాలలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. కమిషన్‌ సభ్యులు గొండు సీతారాం మాట్లాడుతూ బాలలు, విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేస్తున్న మత్తు పదార్థాలు, బాలల అక్రమ రవాణా వ్యవహారాలపై కమిషన్‌ డేగ కళ్ళతో పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. మత్తు పదార్థాలు, బాలల అక్రమ రవాణా రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ముందు ఉంచడంలో అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆదిలక్ష్మి, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు జి.ఉమా, సిడబ్ల్యుసి చైర్‌పర్సన్‌ ఎంఆర్‌ఎల్‌ రాధ, అడిషనల్‌ ఎస్పీ పిఎస్‌ఎన్‌ రావు, జిల్లా ఆబ్కారి అధికారి ఎన్వి రమణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి ఉషారాణి, అదనపు వైద్య శాఖ అధికారి శారదబాయి, బీసీ సంక్షేమ శాఖ అధికారి కే రాజేశ్వరి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అజరు బాబు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగ శిరీష, దిశ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ టి లక్ష్మి, డ్రగ్‌ కంట్రోల్‌, కమర్షియల్‌ టాక్స్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.