
ప్రజాశక్తి - భీమవరం
విద్యార్థులు, బాల బాలికల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి బాలోత్సవం ఎంతో దోహదం పడుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. స్థానిక చింతలపాటి బాపిరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫారం ఫర్ ఆర్టిస్ట్, వసుధ ఫౌండేషన్, భీమవరం డ్రాయింగ్ టీచర్స్ అసోసియేషన్, పాలకొల్లు ఉదయ ఆర్ట్ గ్యాలరీ, మానవత, భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బాలోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, చిన్నారులు, తల్లిదండ్రులు వేలాదిమంది తరలివచ్చారు. పాఠశాల ప్రాంగణమంతా కిక్కిరిసిపోయి సందడిగా మారింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అడవి బాపిరాజు స్మారకోన్నత చిత్రలేఖనం పోటీలను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు, చిత్రకారుడు, న్యాయవాది, అధ్యాపకుడు, రచయిత అడవి బాపిరాజు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ బాలల మానసిక వికాసానికి అలాగే విద్యాభ్యాసం ద్వారా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి కళలు అవకాశం కల్పిస్తాయన్నారు. చిత్ర లేఖనం పోటీలు వంటివి పిల్లల్లో కళల పట్ల అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను, శక్తిని బయటకు తీయడానికి ఎంతో అవసరమన్నారు. వారికి ప్రోత్సాహం అందించడం ద్వారా ప్రతిభావంతులుగా తయారవుతారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రాయింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ షీట్స్ కొన్నింటిని కలెక్టర్ అందజేశారు. అడవి బాపిరాజు మనవరాలు కాళ్లకూరు పద్మను కలెక్టర్ సత్కరించారు. ముందుగా రాయలం పాఠశాలకు చెందిన డ్రాయింగ్ టీచర్ రాజేంద్ర ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ సందర్శించి డ్రాయింగ్ టీచర్‌ను అభినందించారు. అలాగే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీల్లో నిర్వహించిన చిత్రలేఖన పోటీలకు వేలాదిమంది విద్యార్థులు, బాలబాలికలు హాజరై ప్రతిభ కనబర్చారు. అనంతరం వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ కె.శ్రీనివాసులురాజు, తహశీల్దార్ వై.రవికుమార్, వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, కన్వీనర్ ఇందుకూరి ప్రసాద్‌రాజు, సిహెచ్‌బిఆర్‌ఎం స్కూల్ కరస్పాండెంట్ కె.రామకృష్ణంరాజు, కొత్తపల్లి శివరామరాజు, చెరుకువాడ రంగసాయి, మానవత ప్రతినిధులు సాగి జానకి, రామరాజు, బుద్ధరాజు వెంకటపతిరాజు, బాలోత్సవ కమిటీ ప్రతినిధులు పి. సీతారామరాజు, బి.చైతన్య ప్రసాద్, జి.ధనుష్, వాసు, ప్రసాద్, వి.రాధాకృష్ణ, విజయవాడ పోరం ఫర్ ఆర్ట్స్‌కు చెందిన స్పూర్తి శ్రీనివాస్, ఎస్‌పి.మల్లిక్ కళాసాగర్, సునీల్ హనుమకొండ, అరసవల్లి గిరిధర్, జాషువా సంస్కతిక వేదిక కార్యదర్శి గుండు నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.