
బాలోత్సవం వేడుకల బ్రోచర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి - భీమవరం
బాలల్లో సృజనాత్మకత, నైతిక విలువలు పెంపొందించాలని, పోటీతత్వం నేర్పాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలకు ఈ విషయాల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాలోత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే భీమవరం బాలోత్సవం వేడుకల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రఖ్యాత చిత్రకారుడు అడవి బాపిరాజు స్మారక చిత్రలేఖన పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహక కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, ఇందుకూరి ప్రసాదరాజు, కంతేటి వెంకటరాజు, వెంకటపతిరాజు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి భీమవరం చింతలపాటి బాపిరాజు హైస్కూల్లో బాలోత్సవం పిల్లల సంబరాల పేరిట అడవి బాపిరాజు స్మారక చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నామని, 3 విభాగాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు. సబ్ జూనియర్స్ (ప్రకృతి దృశ్యం), జూనియర్స్, సీనియర్స్ (పర్యావరణ పరిరక్షణకై మన బాధ్యత) విభాగాల్లో పోటీలు జరుగుతాయని, ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరూ పాల్గొనాలని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.